న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఏషియన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్ కోసం సోమ, మంగళవారాల్లో నిర్వహించే నేషనల్ బ్యాడ్మింటన్ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 14–19 తేదీల్లో జరిగే ఈ టోర్నీ కోసం సీనియర్ సెలక్షన్ కమిటీ సైనా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సొద్‌ను ట్రయల్స్‌లో పాల్గొనాలని సూచించింది. వీరిలో ఒకరిని ఏషియన్ టోర్నీలో సెకండ్ విమెన్స్ సింగిల్స్ ప్లేయర్‌గా డబుల్స్‌లో పీవీ సింధుకు జోడీగా ఎంపిక చేయాలని భావించింది. కానీ, సైనా, మాళవిక ట్రయల్స్‌కు రావడం లేదు. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్)కి తెలిపారు. దాంతో, అష్మితా చాలిహాను ట్రయల్స్‌కు పిలిచినట్టు బాయ్ వర్గాలు తెలిపాయి.
ఆకర్షి, అష్మితలో ఒకరిని ఎంపిక చేయనున్నారు. కాగా, 2022లో తీవ్రంగా నిరాశ పరిచిన సైనా నెహ్వాల్.. కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొనలేదు. ఇక, ఇటీవలి పెర్ఫామెన్స్ ఆధారంగా పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్‌ను సెలెక్షన్ కమిటీ నేరుగా 14 మందితో కూడిన టీమ్‌కు ఎంపిక చేసింది. టీమ్‌లో మిగతా షట్లర్లను ట్రయల్స్ ఆధారంగా సెలెక్ట్ చేయాలని డిసైడైంది. అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి, కృష్ణప్రసాద్, విష్ణువర్దన్ గౌడ్, ఇషాన్ భాట్నాగర్, సాయి ప్రతీక్, పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ, అశ్విని భట్ ట్రయల్స్‌లో పాల్గొంటారు.