Saina Nehwal: బుమ్రా నాతో బ్యాడ్మింటన్ ఆడగలడా.. నా సర్వ్‌ని అడ్డుకోలేడు: సైనా నెహ్వాల్

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ అంగ్రిష్ రఘువంశీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించింది. శుక్రవారం (ఆగస్టు 9) శుభంకర్ మిశ్రాతో జరిగిన ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తనపై యువ బ్యాటర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది.

బుమ్రా నా సర్వ్‌ని అడ్డుకోలేడు

"ఎవరూ చచ్చిపోవడానికే క్రికెట్ ఆడరు. బుమ్రాతో నేనెందుకు క్రికెట్ ఆడాలి? ఒకవేళ బుమ్రా నాతో బ్యాడ్మింటన్ ఆడితే, నా సర్వీస్ అందుకోలేడు.. 300కి.మీ వేగం కావచ్చు.. మరేదైనా కావొచ్చు.." అని సైనా చెప్పుకొచ్చింది. 

గతంలో ఏం జరిగిందంటే..?

భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారీ నజరానా లభించింది. బీసీసీఐ ఏకంగా రూ.125 కోట్ల రూపాయలను ఆటగాళ్లను నజరానా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్‌లకు రూ. 10 కోట్ల నగదు బహుమతులు అందించింది. దీనికి బ్యాడ్మింటన్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతుందని సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెలలో నిఖిల్ సింహా పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ క్రికెట్‌పై అందరి దృష్టిని ఆకర్షించడం అన్యాయమని.. అన్ని క్రీడలకు సమానమైన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసింది. 

 
"కొన్నిసార్లు, క్రికెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ విషయంలో నాకు బాధగా ఉంటుంది. బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ క్రీడలు శారీరకంగా చాలా కఠినమైనవి. మీకు షటిల్ లో సర్వ్ చేయడానికి కూడా సమయం ఉండదు. కొన్నిసార్లు ఊపిరి కూడా కష్టపడి పీల్చుకోవాల్సి వస్తుంది". అని సైనా నెహ్వాల్ తెలిపింది. సైనా వ్యాఖ్యలకు కేకేఆర్ యువ ప్లేయర్ రఘువంశీ.. "బుమ్రా 150 కి.ల బౌన్సర్ వేస్తే ఎలా ఆడుతుందో" అని తన ఎక్స్ లో తెలిపాడు. అయితే, అతను చేసిన ఈ వ్యాఖ్యలకు సైనా నెహ్వాల్ కు వెంటనే క్షమాపణలు తెలిపాడు.