
న్యూఢిల్లీ: తాను బ్యాడ్మింటన్ కంటే టెన్నిస్‌ను ఎంచుకుని ఉంటే మరింత మెరుగ్గా ఆడే దానినని ఇండియా టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. ‘నా తల్లిదండ్రులు నన్ను టెన్నిస్‌లో ఉంచి ఉంటే బాగుండేదని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. అందులో ఎక్కువ డబ్బుతో పాటు మరింత బలంగా ఉండేదాన్ని. బ్యాడ్మింటన్‌తో పోలిస్తే టెన్నిస్‌లోనే మెరుగ్గా ఆడేదాన్నేమో’ అని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ‘హర్ స్టోరీ–మై స్టోరీ’ ప్రసంగంలో సైనా వ్యాఖ్యానించింది. 8 ఏళ్ల వయసులో తాను రాకెట్‌ను పట్టుకున్నప్పుడు రోల్ మోడల్స్ ఎవరూ లేరని చెప్పింది.
వరల్డ్ నంబర్‌వన్ కావాలని, ఒలింపిక్స్ మెడల్ గెలుస్తానని ఏనాడూ అనుకోలేదని తెలిపింది. ఎందుకంటే తన కంటే ముందు బ్యాడ్మింటన్‌లో ఎవరూ ఈ ఘనతలు సాధించలేదని పేర్కొంది. ప్రతి ఒక్కరు స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించారు. ‘ఆటలపై దృష్టి పెట్టమని నేను ఎప్పుడూ పిల్లలకు చెబుతా. చైనా 60, 70 మెడల్స్ సాధిస్తే మనం 3, 4తోనే ఆగిపోతున్నాం. చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నా ఏనాడూ వాళ్ల పేర్లు పత్రికల్లో రావు. కానీ ప్లేయర్ పేరు కచ్చితంగా ఉంటుంది. నేను హార్డ్ వర్క్‌ను ఇష్టపడ్డాను. మెరుగైన ప్లేయర్ వందసార్లు చేసిన పనిని నేను వెయ్యిసార్లు చేశా. అందుకే ఆటలో సక్సెస్ అయ్యా’ అని సైనా వెల్లడించింది.