CPL 2024: నెరవేరిన ప్రీతి జింటా కల.. కరేబియన్ లీగ్‌ విజేత లూసియా కింగ్స్

CPL 2024: నెరవేరిన ప్రీతి జింటా కల.. కరేబియన్ లీగ్‌ విజేత లూసియా కింగ్స్

బాలీవుడ్ నటి ప్రీతి జింటా ట్రోఫీ నిరీక్షణకు తెర పడింది. ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు ఫ్రాంచైజీగా దక్కని ట్రోఫీని ఎట్టకేలకు  కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సాధించింది. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ తరఫున ప్రీతి జింటా సహా యజమానిగా ఉంటుంది. భారత కాల మాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన కరేబియన్ లీగ్ ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్‌ను ఓడించి సెయింట్ లూసియా కింగ్స్ విజేతగా నిలిచింది.

11 ఏళ్ల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో సెయింట్ లూసియా కింగ్స్ కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యానా అమెజాన్ వారియర్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. నూర్ అహ్మద్ పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. గయానా జట్టులో ఒక్కరు కూడా 30 పరుగులు చేయకపోవడం విశేషం. లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. 

చివరి 5 ఓవర్లలో సెయింట్ లూసియాకు 65 పరుగులు కావాలి. ఈ దశలో జట్టు విజయంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే మొయిన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ప్రీటోరియస్ వేసిన 17 ఓవర్లో 20 పరుగులు పిండుకున్నారు. ఛేజ్(39), ఆరోన్ జోన్స్ (48) భారీ హిట్టింగ్ తో రెండు ఓవర్లలోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చారు.  రోస్టన్ చేజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ మొత్తం నిలకడగా రాణించి 22 వికెట్లు తీసిన నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.