చిరంజీవి కూటమికి మద్దతిస్తే .. మాకే మంచిది.. సజ్జల

2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమరం కీలక దశకు చేరిన క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమాతో ఉన్న జగన్ ఒకవైపు, జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరొకవైపు వెరసి రాష్ట్రంలో హోరాహోరీ పోరు నెలకొంది. ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతివ్వటం, కూటమికి ఓటేయాలని ప్రజలకు పిలుపునివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కూటమికి చిరంజీవి మద్దతివ్వటంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల. చిరంజీవి మద్దతివ్వడం తమ పార్టీకే మంచిదని, జగన్ వ్యతిరేక శక్తులన్నీ ఒకటయ్యాయని, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎందుకు ఉన్నారో ఆయనకే తెలియదని, ఆయన పరిపక్వత లేని వ్యాఖ్యలు చేయటంలో వింతేమీ లేదని అన్నారు. జగన్ న నేరుగా ఎదుర్కోలేకనే కూటమి కుట్రలకు పాల్పడుతోందని అన్నారు సజ్జల.