
వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోసాని కృష్ణమురళి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఇటీవల అరెస్ట్ అయిన నటుడు పోసాని కృష్ణమురళి.. సజ్జల చెప్పడం వల్లనే తాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సజ్జల, ఆయన కుమారుడిని పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశముండటంతో వాళ్లు ముందగానే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.
కాగా, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని 2025, ఫిబ్రవరి 26న ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజా అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసుల్లో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ నెంబర్ 65/25 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ALSO READ | వైసీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ పని చేయొద్దు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ నుంచి హైదరాబాద్లోని పోసాని ఇంటికి ఒక ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుల్స్ టీం వచ్చి పోసానిని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు.అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె పీఎస్కు పోసానిని తరలించి.. దాదాపు 9 గంటల పాటు సుధీర్ఘంగా విచారించారు. విచారణలో.. సజ్జల చెప్పడంతోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను తిట్టినట్లు పోసాని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, పోసానికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు.