ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని, వాళ్ల పేర్ల ఇప్పుడే బయటపెట్టలేమని చెప్పారు. సరైన టైమ్ లో వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీకి సంఖ్యా బలం ఉండటంతో 7 గురిని బరిలోకి దింపామన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాము లెక్కలోకి తీసుకోలేదని సజ్జల చెప్పారు. చంద్రబాబు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నారని సజ్జల ఆరోపించారు.
అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేసినట్లుగా వైసీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని, తాను ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టే తనని అనుమానిస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి చెప్పారు. తాను వైసీపీకి విధేయురాలిగా ఉన్నానని, ఎమ్మెల్సీ ఓటింగ్‌కు ముందు తాను సీఎం జగన్ ను కలిసినట్టుగా శ్రీదేవి చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. టీడీపీకి బలం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి 23 ఓట్లతో ఆమె అనుహ్యంగా గెలిచారు. అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనుహ్యంగా 3 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయం మరిచికపోకముందే టీడీపీ సత్తా చాటింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మెజార్టీకి అవసరమైన ఎమ్మెల్యేలు లేకపోయినా పార్టీ గెలవడంపై ఖుషి అవుతున్నారు. అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి అతి పిన్న వయసులోనే విజయవాడ మేయర్‌గా తనదైన ముద్రవేసిన అనురాధ ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో ఆమెను పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందిస్తున్నారు.