ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ కి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూటమి తరఫున ధర్మవరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ అధికార వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. వైసీపీ అవినీతి పాలనను అంతమొందించేందుకే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలకు స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అమిత్ షా మాటల్లో పస లేదని, చంద్రబాబు చెప్పిందే అమిత్ షా మాట్లాడరని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. తాము చేసిన ప్రతి పనికి లెక్కలు ఉన్నాయని, ఏ బ్యాంకుకి వెళ్లినా ఆధారాలు ఉంటాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎమ్ లాగ వాడుకుంటున్నారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు అమిత్ షా మర్చిపోయారా అని ప్రశ్నించారు సజ్జల.