రెడ్ సిగ్నల్ పడేలోపు వెళ్లాలనుకుని.. కారును ఢీకొట్టి పల్టీలు

రెడ్ సిగ్నల్ పడేలోపు వెళ్లాలనుకుని.. కారును ఢీకొట్టి పల్టీలు

సికింద్రాబాద్, వెలుగు:  రెడ్ సిగ్నల్ పడుతుందనే తొందరలో కారును స్పీడ్ నడిపి మరో కారును ఢీకొనగా..  పల్టీలు కొట్టింది. రెండు కార్లలో ప్రయాణించేవారు క్షేమం గా బయటపడిన ఘటన మారేడుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. గురువారం ఈసీఐఎల్​కు చెందిన ఎం. నరేష్​ కియా కారులో కార్ఖానా నుంచి జేబీఎస్​వైపు వెళ్తున్నాడు.  సికింద్రాబాద్​క్లబ్​వద్దకు వెళ్లగానే  రెడ్​సిగ్నల్​పడుతుందనే తొందరలో కారును స్పీడ్ గా డ్రైవ్ చేశాడు. 

అప్పుడే క్లబ్​నుంచి అడ్వకేట్ సుశీల్​కారులో బయటకు రాగా ఢీకొట్టాడు. దీంతో నరేష్ కారు డివైడర్​ను ఢీకొని మూడు పల్టీలు కొట్టి నిలిచిపోయింది. నరేష్ కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెళ్లి బోల్తాపడిన కారును తొలగించారు. రెండు కార్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  అతివేగంతో కారు నడుపుతూ ఢీకొట్టాడని నరేష్ పై అడ్వకేట్ సుశీల్​కుమార్ ​ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు : సజ్జనార్ ట్వీట్

సికింద్రాబాద్ క్లబ్​వద్ద కార్లు ఢీకొని బోల్తా కొట్టిన ఘటనపై టీజీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తి కర ట్వీట్​చేశారు.  “ కొందరు వాహనదారులు సిగ్నల్​పడినప్పుడు ఆగే ఓపిక లేక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. సిగ్నల్స్ పడినపుడు ఒక్క నిముషం ఆగితే కొంపలేం మునిగిపోవు.. ప్రపంచమేమి ఆగిపోదు” అంటూ కామెంట్ చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్​చేసి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, దీంతో బాధిత కుటుంబాలకు  తీరని శోకం మిగల్చకండి అంటూ వాహనదారులను ఆయన సూచించారు.