గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న. పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని మెదడులో ఆలోచనలు రేపేది అని పరమార్థాన్ని చెప్పేది.. పాటంటే మాటలతో తూటాలను ఎక్కుబెట్టి.. అన్యాయపు మర్మాన్ని రట్టు చేసేది అని అర్థం చెప్పిన వారు గద్దర్. ఎన్నో ప్రజా పోరాటాలను ముందుండి నడిపించి, అన్ని పక్షాల ప్రజలను కలుపుకుని సమ సమాజ నిర్మాణానికి అలుపెరగని పోరాటం చేసి, మృత్యువుతో పోరాడి ఓడినా.. ప్రజల నాలుకలపై పాటవై చిరంజీవిగా నిలిచారు గద్దర్.
సుదీర్ఘ పరిచయం..
గద్దర్తో నాకు సుమారు దశాబ్ద కాలం పాటు పరిచయం ఉంది. ప్రజా ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ఎన్నో సందర్భాల్లో నాతో పాలు పంచుకున్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు చెప్పేవారు. ఒకానొక సందర్భంలో తను రాసిన పాట ‘మల్లె తీగకు పందిరి వోలె... మసక చీకటిల వెన్నెలవోలె.. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా.. తొడ బుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ అనే పాటకు ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించినా తను దాన్ని తిరస్కరించినట్లు చెప్పి పాటపై తనకున్న గౌరవాన్ని చాటి, పాటంటే వ్యాపారం కాదని, పాటంటే ప్రజల నాడి అని చెప్పారు. గద్దర్ ఎన్నో సందర్భాల్లో నన్ను కలిసి ఆయన మీద నమోదైన కేసుల గురించి చర్చించేవారు. తను చెప్పాల్సిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, సున్నితంగా చెప్పేవారు. ఎంత పెద్ద అధికారి అయినా రాజకీయ నాయకులనైనా, వయసులో తనకంటే చిన్న వారిని కూడా నోరార ‘అన్నా’ అని పిలిచేవారు. ఆసువుగా పాట పాడటంలో గద్దర్ ను మించిన కవి, గాయకుడు లేరనే చెప్పాలి.తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు గద్దర్. ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేక పోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బతికే ఉంటారు. ఉద్యమకారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం బాధాకరం. గద్దర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
- వీసీ సజ్జనార్
(ట్విట్టర్ నుంచి)