హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లని, వారిపై దాడి చేయడం సరికాదని ఎండీ సజ్జనార్ అన్నారు. కొత్తగూడెం జిల్లాలో డ్రైవర్, కండక్టర్ను ప్యాసింజర్లు దూషించడం, ఆటో డ్రైవర్లు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ట్విటర్లో స్పష్టం చేశారు. ‘ఇలాంటి దాడులను ఆర్టీసీ మేనేజ్మెంట్ సహించదు.
ఇప్పటికే మా అధికారులు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి.. విచారణ చేస్తున్నారు’ అని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీకి సిబ్బందే వెన్నుముక అని, ఎంతో నిబద్ధతతో పని చేస్తూ లక్షలాది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నారని వివరించారు. ఎంప్లాయీస్ కృషి కారణంగానే సంస్థ నడుస్తున్నదని, మహాలక్ష్మి స్కీమ్ అమల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. జర్నీ టైమ్లో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి..గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా సహకరించాలని కోరారు.