ఆర్టీసీ సిబ్బందిపై దాడులు సహించం
చట్ట ప్రకారం కఠిన చర్యలుతీసుకుంటం: సజ్జనార్
ముగ్గురు కండక్టర్లపై దాడి చేసిన ప్యాసింజర్లపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై ప్యాసింజర్లు దాడి చేస్తే సహించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. హయత్ నగర్ డిపో కండక్టర్లపై ఓ మహిళ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎండీ బుధవారం ఒక ప్రకటనలో స్పందించారు. ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల మూడు చోట్ల మహిళలు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. హయత్ నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై దాడికి దిగారన్నారు. చిల్లర విషయంలో ఒక మహిళ.. గుర్తింపు కార్డు చూపి జీరో టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు ఆయన సెల్ ఫోన్ లాక్కుని అసభ్య పదజాలంతో మరొక మహిళ దూషించారని తెలిపారు. అలాగే పికెట్ డిపో మహిళా కండక్టర్ పై యాదగిరిగుట్టలో కొందరు మహిళలు సాముహికంగా దాడి చేశారన్నారు.
ఈ మూడు ఘటనలపై రాచకొండ కమిషనరేట్‌లోని సంబంధిత పోలీస్ స్టేషన్ లలో ఆర్టీసీ అధికారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారని సజ్జనార్ వెల్లడించారు. బాధిత కండక్టర్లకు ఎండీ ఫోన్ చేసి మాట్లాడారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. రోజూ 55 లక్షల మంది ప్యాసింజర్లను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న సిబ్బందిపై దాడులు ఏమాత్రం సరికాదన్నారు.
ప్యాసింజర్లు టికెట్ తీసుకోకుండా చెకింగ్ లో పట్టుబడితే కండక్టర్లపై చర్యలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులనే చూపాలని చెప్తున్నా.. ఇప్పటికీ కొందరు ఫొటోకాపీలను, స్మార్ట్ ఫోన్లలో గుర్తింపు కార్డులను చూపుతున్నారని, ఇది సరికాదన్నారు. ప్యాసింజర్లు ఫిర్యాదులు, సమస్యలను తెలియజేసేందుకు ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్ల(040-69440000, 040-23450033)లో సంప్రదించాలని ఎండీ సూచించారు.