ఖజానాలో పైసల్లేక జీతాలు లేట్

విడతల వారీగా వేస్తున్న రాష్ట్ర సర్కారు
అందరి అకౌంట్లలో పడేందుకు పదో తారీఖు దాటుతున్నది
సప్లిమెంటరీ బిల్స్,  సరెండర్ లీవ్స్ పెండింగ్ 
జీపీఎఫ్ లోన్ల కోసమూ తప్పని ఎదురుచూపులు
 

కరీంనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరునెలలుగా జీతాలు  లేట్​ అవుతున్నాయి.  ప్రతి నెలా ఒకటో తారీఖున ఇయ్యాల్సిన జీతాలను ప్రభుత్వం విడతలవారీగా ఇస్తోంది. ఉద్యోగులందరి అకౌంట్లలో పడేందుకు పది, పన్నెండో తారీఖు పడుతోంది. అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం, నెలనెలా వస్తున్న ఆదాయంలో సగం పైసలు వడ్డీలు కట్టేందుకే సరిపోతుండడంతో శాలరీస్​కు  కావాల్సిన రూ. 2,400 కోట్లను నెలాఖరు కల్లా  సర్కారు సర్దుబాటు చేయలేకపోతోంది. అందువల్లే  ఉద్యోగులు, టీచర్లకు ఫస్ట్​ తారీఖున జీతాలు పడ్తలేవు.  పెన్షన్​దారులదీ ఇదే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా  32 ప్రభుత్వ శాఖల పరిధిలో 3 లక్షల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సుమారు రెండు లక్షల మంది పింఛన్​ దారులు ఉన్నారు. ఆరు నెలల ముందుదాక వీరందరికీ ఒకటో తారీఖున జీతాలు పడేవి. ఒకవేళ ఆ రోజు సెలవు ఉంటే మరుసటి రోజు వచ్చేవి.  

అయితే.. ఆరు నెలల నుంచి ఏ జిల్లాలోనూ, ఏ శాఖలోనూ  ఒకటో తారీఖున జీతాలు పడ్తలేవు. రాష్ట్రంలో  33 జిల్లాలు ఉండగా, రోజుకు రెండు మూడు జిల్లాల చొప్పున ప్రభుత్వం జీతాలు వేస్తోంది. ఈ నెల ఒకటో తారీఖున అందాల్సిన జీతం కూడా సోమవారం వరకు  12 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే అందింది.  అందులోనూ కొన్ని శాఖలకు ఆపింది. మిగిలిన జిల్లాల్లోని ఉద్యోగులకు జీతాలు రావాలంటే మరో ఐదారురోజులైనా పట్టేలా కనిపిస్తోంది. 
ఎందుకీ పరిస్థితి..?
సీఎం కేసీఆర్​మాట్లాడితే తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెబుతూ ఉంటారు. వాస్తవానికి మొదట్లో మిగులు బడ్జెట్​ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పులకుప్పలా మారింది. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరాయి. నెలనెలా ప్రభుత్వానికి వివిధ మార్గాల్లో వస్తున్న ఆదాయంలో 40 శాతం వడ్డీలు కట్టేందుకే పోతున్నాయి. ఇవిగాక ఉద్యోగుల జీతాలకు ప్రతి నెలా రూ. 2,400 కోట్లు చెల్లించాలి. కానీ సర్కారుకు ఈ మొత్తాన్ని ఫస్ట్​ తారీఖు కల్లా అడ్జస్ట్​చేయడం సాధ్యం కావడం లేదు.  ఈ క్రమంలోనే ఎంప్లాయీస్​ శాలరీస్​, రైతుబంధు లాంటి స్కీముల కోసం  ప్రభుత్వం దొరికినకాడల్లా అప్పులు చేస్తోంది. ఒక్క జూన్​ నెలలో రాష్ట్ర సర్కారు దాదాపు  రూ. 10 వేల కోట్లు అప్పు తెచ్చింది. మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్​ఆర్బీఎం పరిమితి పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. మరోవైపు ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా రూ. 25 వేల కోట్లు, భూముల విలువ పెంపుతో రూ. 13 వేల కోట్లు రాబట్టి ఖజానా నింపుకోవాలనే ఆలోచనలో ఉన్నది.
ఈ నెల కూడా పాత జీతాలే.. 
ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్​11న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఫస్ట్‌‌  పే రివిజన్‌‌ కమిషన్‌‌ (పీఆర్సీ) 7.5 శాతం ఫిట్‌‌మెంట్‌‌ రికమండ్‌‌ చేయగా, సర్కారు మాత్రం 30 శాతం ఫిట్‌‌మెంట్‌‌ ప్రకటించింది. కనీస వేతన స్కేల్‌‌ రూ. 19 వేలుగా నిర్ణయించింది.  2020 ఏప్రిల్‌‌ నుంచి 2021 మార్చి నెలల పెరిగిన జీతాలను ఎరియర్స్​ రూపంలో సర్వీస్​ఉద్యోగులకు రిటైర్​ అయ్యాక చెల్లిస్తామన్న ప్రభుత్వం.. ఈ ఏడాది ఏప్రిల్​, మే నెలల పెరిగిన వేతనాలను మాత్రం ఈ ఫైనాన్షియల్​ ఇయర్​లోనే జమచేస్తామని ప్రకటించింది. పెన్షనర్ల బకాయిలను మాత్రం రాబోయే 36 నెలల్లో అడస్ట్​ చేస్తామని చెప్పింది. ఈ క్రమంలో జూన్ నెల పెరిగిన జీతాలను జులై  ఫస్ట్​కే ఇస్తామని జూన్​8న మంత్రి హరీశ్​ రావు  చెప్పారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జులైలోనూ పాత జీతాలే పడుతున్నాయి. శాలరీ ఫిక్సేషన్‌‌కు సంబంధించి సాఫ్ట్​వేర్​ ప్రక్రియ లేట్​కావడమే ఇందుకు కారణమని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేశాక ఈ నెల మధ్యలో వేతన బకాయిలను  సప్లిమెంటరీ జీతంగా చెల్లిస్తామని అంటున్నారు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఆగస్టులో ఇచ్చే జీతంతో పాటు జూన్​ బకాయిలు చెల్లించే చాన్స్​ ఉంది. మొత్తం మీద జులై ఫస్ట్​కు కొత్త జీతాలు అందుకుందామన్న ఉద్యోగులు, పెన్షనర్ల ఆశ తీరలేదు. 
పెండింగ్ బిల్లులూ వస్తలేవ్
ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం పెట్టుకున్న బిల్లులైనా వస్తున్నాయా అంటే అదీ లేదు. సీపీఎస్ ఉద్యోగులకు పెరిగిన డీఏ కు సంబంధించిన ఏరియర్స్ ఇంకా అతీగతీ లేవు. నాలుగు ఇన్ స్టాల్ మెంట్లలో చెల్లిస్తామని చెప్పినా ఆరు నెలలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక సరెండర్  లీవ్ ల బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులకు కూడా మోక్షం కలగడం లేదు. ఇవన్నీ ఐదారు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారు. ఫెస్టివల్ అడ్వాన్సులు కూడా ఇవ్వడం లేదు. చాలా మంది ఉద్యోగులు అత్యవసరం ఉండి జీపీఎఫ్  లోన్ అప్లయ్​ చేసుకుంటే గత  ఐదు నెలల నుంచి వస్తలేవు. ఇక ప్రభుత్వ ఉద్యోగిగాని, పెన్షనర్​గాని చనిపోతే  దహన సంస్కారాలకు తక్షణ సాయం కింద ఇవ్వాల్సిన రూ. 20 వేలు కూడా రావట్లేదు. ఆఫీసుల మెయింటెనెన్స్​కు సంబంధించిన బడ్జెట్ బిల్లులు కూడా రాకపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారింది. చాలా జిల్లాల్లో అద్దె భవనాల్లో ఆఫీసులు రన్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన రెంట్లు కూడా రాకపోవడంతో ఆఫీసర్లు నానా తిప్పలు పడుతున్నారు.

ఎవరిని అడగాలె..?   
గతంలో  ఉద్యోగుల బిల్లులను సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులు రెడీ చేసి ఎస్టీవోల్లో సమర్పించేవారు. ఒకటో తారీఖు కల్లా జీతాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆన్ లైన్  అయింది. ఈ –- కుబేర్ ద్వారా చెల్లిస్తున్నారు. ఎస్టీవోలకు బిల్లులు చేరగానే వాటిని ఈ-– కుబేర్​లో అప్‌ లోడ్ చేస్తున్నారు. ఎవరైనా ఉద్యోగి వచ్చి జీతాలు ఎందుకు రావడం లేదని అడిగితే.. ఈ –- కుబేర్​కు పంపించామని చెప్తున్నారు. వాస్తవానికి ఈ-– కుబేర్ లో అప్ లోడ్ చేయగానే ఒకటి రెండు రోజుల్లో అకౌంట్​లో పడాలి. కానీ ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకే లేట్​అవుతోందని, ఆన్​లైన్​లో ‘అవెయిటింగ్ గవర్నమెంట్ అప్రూవల్’ అని వస్తోందని ఉద్యోగులు చెప్తున్నారు.  
చాలా ఇబ్బంది అవుతోంది
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బంది అవుతోంది. ముఖ్యంగా బ్యాంకుల్లో తీసుకున్న లోన్లకు సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా చూస్తున్నరు. సిబిల్ స్కోర్ తగ్గిస్తున్నరు. దీంతో భవిష్యత్ లో తీసుకోబోయే లోన్లకు సమస్యలు వస్తయ్​.  కనీసం డేట్లు మార్చుకుందామంటే ఎప్పుడు జీతాలు వస్తయో తెలియడం లేదు. 
                                                                                                                      - మర్రి శ్రీనివాస్, బీసీ ఎంప్లాయీస్ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు