మెహిదీపట్నం, వెలుగు: ప్రభుత్వం ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆర్పీల సంక్షేమ సంఘం(మెప్మా) రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించి జీతాలు వేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
మెప్మా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మాసబ్ ట్యాంక్మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ముందు ఆందోళనకు దిగారు. అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తమకు 7 నెలల జీతం ఇవ్వడం లేదని చెప్పారు. యూనిఫాం, గౌరవ వేతనం, ఆరోగ్య భద్రత, వారంత సెలవులు, ఇన్సూరెన్స్, అన్ని అలవెన్సులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు 300 మంది ఉద్యోగులు ఆఫీసుకు చేరుకోవడంతో నాంపల్లి పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని సొంత పూచికత్తుపై వదిలి పెట్టారు.