పన్నుల రాబడిలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. దక్షిణాదిలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం మనదే. తెలంగాణ ధనిక రాష్ట్రమని రాష్ట్ర మంత్రులు పదేపదే చెప్తుంటారు. అంకెల పరంగా చూస్తే ఇవన్నీ వాస్తవాలే అనిపించినా, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు ప్రతినెలా రెండో వారం దాకా ఎందుకు ఇవ్వడం లేదో, ధనిక రాష్ట్రంలో జీతాలు లేట్ ఎందుకో ఎవరూ చెప్పరు. ఈ నెల విషయమే తీసుకుంటే మే 7 నాటికి 25 జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏప్రిల్ నెల జీతాలు చెల్లించనే లేదు. రోజుకు కొన్ని జిల్లాల చొప్పున విడతల వారీగా చెల్లించడం ఆనవాయితీగా మారింది. తమ జిల్లా వంతు ఎప్పుడు వస్తుందోనని ఉద్యోగులు ప్రతినెలా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేండ్లుగా ఇదే తంతు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగులకు ఠంచనుగా జీతాలు చెల్లించారు. స్వరాష్ట్రంలో ఒకటో తేదీ కాదు కదా, కనీసం మొదటి వారంలో జీతాలు వస్తే హమ్మయ్య అనుకునే పరిస్థితి ఉద్యోగులకు దాపురించింది.
ఎప్పుడో ఒకసారి జీతాలు లేట్ అయితే, ఏదో విధంగా సర్దుబాటు చేసుకునే వారు. ప్రతినెలా ఆలస్యమే. ఉమ్మడి రాష్ట్రంలో నెలాఖరున దసరా, దీపావళి, రంజాన్ వంటి ప్రముఖ పండుగలు వస్తే వారం రోజుల ముందే వేతనాలు చెల్లించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వరాష్ట్రంలో ముందు కాదుకదా, పండుగల సందర్భంగా కూడా ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల జీతాల చెల్లింపులను అప్పటి ప్రభుత్వాలు ప్రతిష్టగా తీసుకునేవారు. ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇచ్చేవారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న 90వ దశకంలో కూడా ఉద్యోగులకు ఎన్నడూ జీతాలు ఆలస్యం కాలేదు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.
బిల్లులు పెండింగ్.. ఆపైన రిజెక్ట్!
రెగ్యులర్ జీతాలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. సప్లిమెంటరీ బిల్లులను సైతం వెంటవెంటనే పాస్ చేయకుండా ‘ఈ-– కుబేర్’ లో నెలల తరబడి పెండింగులో పెడుతున్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో సమర్పించిన సరెండర్ లీవ్, జీపీఎఫ్ అడ్వాన్సులు, పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, ఎఫ్ఏసీ అలవెన్సు, పీఆర్సీ బకాయిలు, పిల్లల ఫీజు రాయితీ తదితర బిల్లులు నెలల తరబడి పెండింగ్ పెట్టి తీరా ఈ నెల 6న గంపగుత్తగా రిజెక్ట్ చేశారు. సదరు బిల్లులను తిరిగి సమర్పించుకోవాలని అధికారులు హుకుం జారీ చేశారు. సత్వర చెల్లింపులు, పారదర్శకత కోసం అంటూ తీసుకొచ్చిన ‘ఈ- కుబేర్’ సిస్టం నిర్దేశిత లక్ష్యం కోసం వాడుతున్నారా? లేక సెంట్రలైజడ్ పేమెంట్ విధానంతో సెలెక్టెడ్ బిల్లులు పెండింగులో పెట్టడానికి వినియోగిస్తున్నారో అర్థం కాకుండా ఉంది. జీతాలు, ఇతర బిల్లులు పాసై తమ బ్యాంకు అకౌంటులో డబ్బు క్రెడిట్ అయిందో లేదోనని ఉద్యోగ, ఉపాధ్యాయులు రోజూ వెరిఫై చేసుకోవడమే తప్ప, బిల్లులు ఎప్పుడు మంజూరు అవుతాయో చెప్పే నాథుడే రాష్ట్రంలో లేడు. బిల్లుల మంజూరులో పారదర్శకత సైతం పాటించడం లేదు. ఫస్ట్ కం ఫస్ట్ సెర్వుడ్ పద్ధతి అమలు కావడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విపరీత పరిస్థితులు స్వరాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కోవడం బాధాకరమనే చెప్పాలి. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగుల బాధలు పట్టించుకునే వారే లేరా?
సీఎం స్పందించాలి!
గత మూడేండ్లుగా ప్రతినెలా జీతాలు చెల్లించడంలో ఆలస్యమవుతున్నా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆవేదన కలిగిస్తోంది. ఉద్యమాలు చేయడం సంగతి అటుంచి, కనీసం సీఎం కేసీఆర్ను కలిసి సమస్య వివరించి పరిష్కరించే కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం ఉద్యోగులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసికట్టుగా ప్రాతినిధ్యం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం చొరవ చూపాలి. రాష్ట్ర సాధనలో తనతో కలిసి పని చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను దూరం పెట్టడం తగదు. సంఘాల ప్రతినిధులను పిలిపించుకొని చర్చించాలి. ప్రతినెలా జీతాల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూసే దుస్థితిని వెంటనే తొలగించాలి. పెండింగులో ఉన్న మూడు డీఏ వాయిదాలను కూడా రిలీజ్ చేయాలి. తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ సర్కార్ అని తరచూ చెప్పే మాటలను ఆచరణలో చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మూడు డీఏలు పెండింగ్లోనే..
2023-–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 2,90,296 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రకటించింది. రాష్ట్ర ఓన్ రెవెన్యూ రూ.1,53,836 కోట్లు. వీటిలో పన్నుల ద్వారా రాష్ట్ర సొంత రాబడి రూ.1,31,028 కోట్లు. కాగా, నాన్-టాక్స్ ఓన్ రెవెన్యూ రూ.22,808 కోట్లు. ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాల వార్షిక వ్యయం సుమారు రూ.30 వేల కోట్లు కాగా, పెన్షన్ల ఖర్చు రూ.13 వేల కోట్లు. రాష్ట్రానికి సొంత ఆదాయమే భారీగా ఉన్నా జీతాలు, పెన్షన్ల కోసం నెలకు మూడున్నర నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ప్రభుత్వానికి ఎందుకు సమస్యగా మారిందో ఎవరికీ తెలియదు. ఆర్థిక సంవత్సరం చివరలో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో నిధులకు కటకట ఉండి, జీతాలు ఆలస్యం అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ప్రతినెలా లేటైతే ఏమనుకోవాలి? జీతాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో ప్రభుత్వపరంగా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని, దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు, తలసరి ఆదాయం సాధిస్తున్నది తెలంగాణ మాత్రమేనని మంత్రులు చెప్తున్నారు. మరోవైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంలో చేతులెత్తేశారు. కరువు భత్యం(డీఏ) వాయిదాలను సైతం పెండింగులో పెడుతున్నారు. 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మూడు డీఏ వాయిదాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. దాదాపు10.01 శాతం డీఏ పెరగాల్సి ఉంది. డీఏల సంగతి దేవుడెరుగు? సకాలంలో జీతాలు చెల్లిస్తే చాలు అనుకునే దుస్థికి ఉద్యోగ, ఉపాధ్యాయులను తీసుకొస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. మేము అధికారంలోకి వస్తే, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని కొన్ని పార్టీలు హామీలు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడటం అత్యంత దురదృష్టకరం.
- మానేటి ప్రతాపరెడ్డి, గౌరవాధ్యక్షుడు, టీఆర్టీఎఫ్