- రికవరీలో వెనకబడ్డారని 3 నెలలుగా సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు బంద్
భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సెర్ప్ ఉద్యోగులకు 3 నెలలుగా వేతనాలు నిలిపేయడంతో పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. బ్యాంకు లింకేజీ తీసుకున్న సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల నుంచి బకాయిలు రికవరీ చేయడం లేదనే కారణంతో జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు, డీపీఎంల జీతాలను అక్టోబర్ నుంచి నిలిపేశారు. 2022–-23 ఆర్ధిక సంవత్సరంలో 14,810 గ్రూపులలో 7 వేల సంఘాలకు రూ.621 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించారు. 2021–22లో 1,118 సంఘాలకు రూ.613 కోట్లు రుణాలు సెర్ప్ ఉద్యోగులు మంజూరు చేయించారు. వీటిలో రూ.29 కోట్ల రుణాలు రికవరీ కావాల్సి ఉంది. తీసుకున్న అప్పులు తీర్చాల్సిన బాధ్యత సంఘ సభ్యులదే. వారిని మోటివేట్ చేసే బాధ్యత మాత్రమే సెర్ప్ ఉద్యోగులపై ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకోకుండా ఆరుగురు ఏపీంఎంలు, 26 మంది సీసీల వేతనాలు ఆపాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ పర్ ఫార్మింగ్ అసెట్కింద ఇప్పించిన రుణాల రికవరీ బాగానే ఉన్నా తమ వేతనాలు ఆపడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లో 9 శాతం బకాయిలు ఉంటే, నవంబర్ లో 7శాతానికి, డిసెంబర్లో 4.84 శాతానికి సిబ్బంది తీసుకొచ్చారు. రివకరీ శాతం తగ్గించుకుంటూ వచ్చినా వేతనాలు ఆపడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లో 53 మందికి, నవంబర్‌లో 42 మందికి, డిసెంబర్ లో 15 మందికి జీతాలు నిలిపేశారు. దీంతో పండగ పూట తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఆరు మండలాల్లోనే సమస్య..
డిసెంబర్ నాటికి జిల్లా మొత్తం ఎన్పీఏ రికవరీ రేటు 4.84 శాతానికి చేరుకుంది. ఆఫీసర్లు జిల్లాను ఎన్పీఏ రికవరీ రేటు విషయంలో యూనిట్‌గా తీసుకోలేదు. మండలాన్నే యూనిట్‌గా తీసుకొని, 5 శాతం లోపు బకాయిలు ఉన్న వారికే వేతనాలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో పూర్తి ఏజెన్సీ మండలాలైన ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చర్ల, చుంచుపల్లి, జూలూరుపాడులో స్టాఫ్‌కు వేతనాలు ఆగాయి. ఈ మండలాలకు చెందిన సెర్ప్ ఉద్యోగుల్లో చాలా మందికి షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నాయి. వీటితో పాటు ఇంటి అద్దెలు, ఈఎంఐలు, పిల్లల చదువుల ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై అడిషనల్ డీఆర్డీవో నీలేశ్‌ను సంప్రదించగా తాము ఎవరి వేతనాలు ఆపలేదని, ఆఫీసుకు వస్తే పూర్తి సమాచారం ఇస్తామని చెప్పారు.
పీడీ సార్‌కు తిప్పలు చెప్పుకుంటాం..
మూడు నెలల వేతనాలు ఆపడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఎన్పీఏ బ్యాంక్ లింకేజీ రుణాలతో మాకు సంబంధం ఉండదు. రుణాల రికవరీ బాధ్యత మాది కాదు. సభ్యులను మోటివేట్ చేసి రుణాలు కట్టిస్తాం. యూనియన్ లీడర్లకు కూడా ఇబ్బందులు చెప్పుకున్నా ప్రయోజనం లేదు. పీడీ సార్‌ను కలిసి కష్టాలు చెప్పుకుంటాం.
- మధు, సీసీ, జూలూరుపాడు