జాతీయ ఉపాధి హామీ పథకం ..ఉద్యోగుల జీతాలకు బ్రేక్

 

  • ఈనెల జీతాలు ఆపేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ
  • రాష్ట్రంలో 13  వేల మంది ఉద్యోగులు
  • పే స్కేల్ వస్తే తప్ప కష్టాలు తీరవని ఆవేదన

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో పనిచేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల జీతాలకు బ్రేక్  పడింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఖజానా ఖాళీ కావడంతో జీతాలు ఆపేసింది. సాధారణంగా ఉపాధి హామీ పథకంలో అడ్మిన్, స్టేషనరీ ఖర్చుల కింద 6 శా తం బడ్జెట్  కేటాయిస్తారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి ఏప్రిల్​ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్ల పనులు జరిగా యి. దీంట్లో కూలీలకు రూ.144 కోట్లు చెల్లించగా, మెటీరియల్​ కాంపోనెంట్​ కింద రూ. 51 కోట్లు చెల్లించారు. మొత్తం కలిపి సుమారు రూ.200 కోట్లు. దీంట్లో ఆరు శాతం లెక్కన రూ.120 కోట్లు అడ్మిన్​ ఖర్చుల కింద ఉద్యోగుల జీతాలు, స్టేషనరీ​బిల్లులు, ఎంపీడీఓల కార్ల రెంట్లు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్​ నుంచి జూలై వరకు రూ.120 కోట్లు పేమెంట్ ​చేశారు. 

ఆగస్టు నుంచి ఉపాధి హామీ పనులు జరగకపోవడంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఖజానా ఖాళీ అయ్యింది. అయితే, అప్పటికే నిల్వ ఉన్న బడ్జెట్​లో ఏదోరకంగా ఇబ్బందిపడి గత నెల జీతాలు సర్దుబాటు చేశారు. కానీ, ఈనెల జీతాలకు చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ ఉద్యోగులు నాలుగు వేల మంది పనిచేస్తుండగా, ఫీల్డ్ అసిస్టెంట్లు 9 వేల మంది వరకు ఉన్నారు. వీళ్లందరికి జీతాల రూపంలో ప్రతినెలా రూ .30 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రతి నెలా మొదటి వారంలోనే జీతాలు ఉద్యోగుల అకౌంట్లలో పడతాయి. కానీ, ఇప్పుడు జీతాలు లేట్​ కావడంతో ఉ ద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీలో కొత్తగా వచ్చిన ఎన్ఐసీ సాఫ్ట్​వేర్​ ఏ నెల జీతాలు ఆ నెల చెల్లిస్తేనే సాఫ్ట్​వేర్​ రిసీవ్​ చే సుకుంటుంది. ఒక్క నెల ఆలస్యమైనా జీతాలు పెండింగ్​లో పడిపోతాయి. మళ్లీ వాటిని వెనక్కి తెచ్చుకోవడం కష్టమని ఉద్యోగులు ఆవేదన చెందు తున్నారు.