హైదరాబాద్, వెలుగు: కరోనా బారిన పడ్డ శానిటేషన్ కార్మికులను బల్దియా పట్టించుకోవడం లేదు. సెకండ్ వేవ్‌లో కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి జీతాల్లో కోతలు విధిస్తోంది. పనిచేసిన రోజులకు మాత్రమే జీతం ఇస్తోంది. రోడ్లను క్లీన్‌గా ఉంచుతూ..చెత్తను చేతులతో ఎత్తిపారేస్తూ కరోనా బారిన పడుతున్న శానిటేషన్ కార్మికుల జీతాలు కట్ చేయడంపై యూనియన్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆపదలో ఉన్న కార్మికులను ఆదుకోవాల్సిన బల్దియా ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల తీరుపై సంఘాల నేతలు మండిపడుతున్నారు. కార్మికులకు పూర్తి జీతం అందించడంతో పాటు వారికి ఇన్సెంటీవ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బల్దియాలో 27 వేల మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిలో 18 వేల మంది శానిటేషన్ వర్కర్లు ఉన్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో కలిపి దాదాపు 2 వేల మంది వరకు శానిటేషన్ వర్కర్లు కరోనా బారినపడ్డారు. దాదాపు 25 మంది చనిపోయారు. గతేడాది కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్న కార్మికుల జీతాలను కట్ చేయనప్పటికీ ఈసారి అధికారులు కోతలు విధిస్తున్నారు. తమకు పాజిటివ్ వచ్చిందని సిబ్బంది అధికారులకు ముందే చెప్పినా బయోమెట్రిక్ లో అటెండెన్స్ లేని కారణంగా జీతాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.
200 మంది బాధితులు..
గత నెలలో గ్రేటర్ వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికుల్లో కరోనా బారిన పడ్డ 200 మందికి జీతాలు కట్ చేసి, పనిచేసిన రోజులకు మాత్రమే వేతనాలు అందించినట్లు సమాచారం. కొందరు సిబ్బంది కరోనా నుంచి కోలుకుని వచ్చి జీతాల గురించి అధికారులను అడిగినా వారు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. పాజిటివ్ రిపోర్టు చూపించినా అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కట్‌చేసిన జీతం పైసలను తిరిగివ్వాలని కోరుతున్నారు. శానిటేషన్ వర్కర్లు డ్యూటీ అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ మెషీన్ ను వాడుతున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో బయోమెట్రిక్ అటెండెన్స్ లేకుండానే కార్మికులు జీతాలు చెల్లించారు. కానీ ఈ సారి ఆ విధానాన్ని అమల్లోకి తీసుకురాలేదు. కరోనా వచ్చిన వారు డ్యూటీకి హాజరు కాకపోవడంతో బయోమెట్రిక్ లో ఆబ్సెంట్ పడుతోంది. అలా ఎన్ని రోజులు పడితే అన్ని రోజుల జీతాలు కార్మికులకు అందడంలేదు.
మొత్తం పైసలు రాలే
గత నెల 12న కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్నా. మిగతా సిబ్బందికి, అధికారులకు ఈ విషయం చెప్పిన. కరోనా తగ్గే వరకు ఇంట్లో ఉండాలని అందరూ చెప్పారు.15 రోజులు ఇంట్లో ఉన్న రోజుల జీతాన్ని కట్ చేసి మిగతా పైసలను అకౌంట్లో వేశారు. కరోనా వచ్చిన వారికి ఎక్కడా జీతం కట్ చేస్తలేరు. మాకు మాత్రమే ఎందుకు ఇట్ల చేస్తున్నరో అర్థమైతలేదు.
- వరలక్ష్మి, శానిటేషన్ కార్మికురాలు
కార్మికులను ఆదుకోవాలె
శానిటేషన్ కార్మికుల కాళ్లు కడిగినా తక్కువేనన్న సీఎం కేసీఆర్ వారి ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. బల్దియా ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి మరిచారు. కరోనా టైమ్‌లో కార్మికులకు భరోసా ఇవ్వాల్సింది పోయి వారి జీతాలు కట్ చేయడం దారుణం. కార్మికుల జీతాల్లో నుంచి కట్ చేసిన డబ్బులను వెంటనే చెల్లించకపోతే ఆందోళన చేస్తం.
- ఊదరి గోపాల్, బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ చైర్మన్