- నాలుగు నెలలుగా జీతాలు రాక అవస్థలు
- ఇప్పటికే అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా అందని వేతనాలు
- ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు రిపోర్ట్
నల్గొండ, వెలుగు : నల్గొండలోని ప్రభుత్వ మెడికల్కాలేజీలో శానిటేషన్, సెక్యురిటీ ఉద్యోగులు జీతాలు అందక విలవిలలాడుతున్నారు. గత నాలుగైదు నెలల నుంచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ జీతాలు అడిగితే రేపు, మాపు అని ఇబ్బందులు పెడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మెడికల్ కాలేజీని విజిట్ చేసినప్పుడు కూడా ఉద్యోగుల జీతాల గురించి ఆరా తీశారు.
ప్రతినెలా ఇస్తున్నామనే మెడికల్ కాలేజీ అధికారులు దాటవేశారు తప్ప.. అసలు నిజం బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఇప్పటికే కలెక్టర్ ప్రతివారం మెడికల్ కాలేజీ, సర్కారుఆస్పత్రిలో వసతులు, సమస్యలపై రివ్యూ చేస్తున్నా.. ఏజెన్సీ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
ఏజెన్సీపై అధికారులకు ఫిర్యాదు..
ఇక్కడి నుంచి ఇటీవలే బదిలీ అయిన మెడికల్‌కాలేజీ ప్రిన్సిపాల్ చర్యలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల కాంట్రాక్టు వ్యవహారాలు, ఉద్యోగుల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. 37 మంది ఉద్యోగులకు జీతాలు రాకుండా చేయడంలోనూ ఆఫీసర్ల తప్పిదాలే ప్రధాన కారణమని తెలిసింది. 2023లో టెండర్లు పిలిచినప్పుడు ఎంపికైన ఏజెన్సీకి కాంట్రాక్టు ఇవ్వకుండా పది నెలల నుంచి వివిధ కారణాలతో నానాబెట్టారు. దీంతో సదరు ఏజెన్సీ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని మరో ఏజెన్సీకి బదిలీలు జరగడానికి ముందు కాంట్రాక్టు కట్టబెట్టడం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో మెడికల్ కాలేజీ ఆఫీసర్లకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీనిపై ఏజెన్సీని కాలేజీ ఆఫీసర్లు మందలించినప్పటికీ జీతాలు ఇవ్వకపోవడంతో ఆ ఏజెన్సీ మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు రిపోర్ట్ పంపినట్లు తెలిసింది. దీనిపై మెడి కల్కాలేజీ ఏవో ప్రవీణ్ ను వివరణ కోరగా సిబ్బంది ఫిర్యాదు మేరకు కలెక్టర్ కు రిపోర్ట్ఇచ్చామని 'వెలుగు'తో చెప్పారు.
పెంచిన జీతాలు కూడా ఇవ్వడం లేదు..
2019 నుంచి 37 మంది ఉద్యోగులు మెడికల్కాలేజీలో అనాటమి, ఏవో బ్లాక్, బయో కెమిస్ట్రీ, ఎగ్జామ్నేషన్ హాల్ లో పనిచేస్తున్నారు. 2023కు ముందు జీతాలు రూ.6 వేలు మాత్రమే ఉండగా, దాన్ని గత ప్రభుత్వం రూ.11 వేలకు పెంచింది. పెంచిన జీతాలు ఇవ్వకుండా పాత జీతాలే ఇస్తున్నారని ఏజెన్సీని నిలదీసిన ఒకరిద్దరికి మాత్రం రూ.11 వేలు ఇచ్చి.. మిగితా వారికి పస్తులు పెడుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.