Good News : వెయ్యి కోట్లు తగ్గిన యాంటీబయాటిక్స్ అమ్మకాలు..!

రోగం చిన్నదా పెద్దదా అనేదాంతో సంబంధం లేకుండా.. రోగం ఏదైనా యాంటీబయాటిక్స్ మందులు రాయటం ఇటీవల కామన్ అయిపోయింది.. జలుబు అయినా దగ్గు అయినా.. ఎలాంటి జ్వరం అయినా సరే యాంటీబయాటిక్స్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలు.. ఆలస్యంగా అయినా సత్ఫలితాలను ఇస్తున్నాయంట.. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టిన కేరళ సర్కార్.. వివిధ రకాల వ్యాధులకు యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లను కఠినంగా ఆదేశించింది. దీని ఫలితాలు ఇప్పుడు కనిపించాయని నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. 

కేరళ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల రూపాయల మందుల అమ్మకాలు జరుగుతాయి. ఇందులో 4 వేల 500 కోట్ల రూపాయలు యాంటీబయాటిక్స్ అమ్మకాలు. 2023 మార్చి నుంచి 2024 జూన్ నెల మధ్య కాలంలో.. యాంటీబయాటిక్స్ అమ్మకాలు వెయ్యి కోట్లు తగ్గాయి. 3 వేల 500 కోట్ల రూపాయలకు తగ్గాయి. ప్రభుత్వ నిబంధనలే దీనికి కారణం అని స్పష్టం అవుతుంది. 

ఇంతకీ కేరళ సర్కార్ ఏం చర్యలు తీసుకున్నదో తెలుసుకుందాం.. మితిమీరిన యాంటీబయాటిక్స్ వల్ల మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీన్ని గుర్తించి.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు, ఇతర ఆయింట్ మెంట్లు విక్రయిస్తే మెడికల్ షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా దాడులు నిర్వహించిన.. నిఘా పెట్టి వందల షాపుల లైసెన్సులు రద్దు చేసింది కేరళ ప్రభుత్వం. దీంతో భయపడిపోయిన మెడికల్ షాపు ఓనర్లు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ మందులు అమ్మటం తగ్గించేశారు. అదేవిధంగా డాక్టర్లు సైతం యాంటీబయాటిక్ మందులు రాయటం కూడా తగ్గించారు. ఈ ప్రభావంతో వెయ్యి కోట్ల అమ్మకాలు తగ్గాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇటీవల కాలంలో ప్రతి రోగానికి యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడటం వల్ల మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి.. దీర్ఘకాలిక వ్యాధులతో జనం చనిపోతున్నారు. పెద్ద జబ్బు చేసినప్పుడు యాంటీబయాటిక్స్ కూడా పని చేయటం లేదు. దీన్ని గుర్తించిన కేరళ సర్కార్.. కఠిన నిబంధనలు అమలు చేసింది. ఈ క్రమంలోనే యాంటీబయాటిక్ మెడిసిన్స్ అమ్మకాలు వెయ్యి కోట్లు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ.. WHO సైతం ఎప్పుడో హెచ్చరించింది. యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించకపోతే కనీసం కోటి మంది చనిపోతారనే హెచ్చరికల క్రమంలో.. కేరళ సర్కార్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చింది.