రూ.3లక్షలకు శిశువు విక్రయం

  •  అడ్డుకున్న తల్లి. ఆరుగురు అరెస్ట్ 

సూర్యాపేట, వెలుగు: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శిశు విక్రయం కలకలం రేపింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం నాయకుని తండాకు చెందిన నెల వయస్సున్న ఆడ శిశువు అమ్మకానికి పెట్టగా తల్లి అడ్డుకొని గొడవ చేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలను వెల్లడించారు. నాయకుని తండాకు చెందిన పూల్ సింగ్ తోపాటే అతని కూతురు రాజేశ్వరి కూడా ఉంటుంది. రాజేశ్వరికి రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో పెంచడం భారమని భావించి మధ్యవర్తుల ద్వారా పూల్​సింగ్​ మనవరాలిని అమ్మే ప్రయత్నం చేశారు. 

పూల్ సింగ్ మేనకోడలు దుర్గ, సైదమ్మ కు పాపను అమ్మనున్నట్టు చెప్పారు. గ్రామానికి చెందిన రాజా నాయక్ ద్వారా సూర్యాపేటలో ఏఎన్ఎం నాగమణిని సంప్రదించారు. ఆమె సహాయంతో పాపను రూ. 3 లక్షలకు అమ్మేలా ఏపీకి చెందిన విజయలక్ష్మి, అశోక్, సరోజ, సింధు, నరేశ్ లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. శిశువును పరీక్షించేందుకు మునగాల మండలం మొద్దల చెరువు స్టేజి వద్దకు రావాలని సూచించారు. 

తాత పూల్ సింగ్ పాపను తీసుకుని వెళ్లగా.. రాజేశ్వరి తన పాపను అమ్మనని తండ్రితో గొడవకు దిగింది. వారి గొడవను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని విక్రయాన్ని అడ్డుకున్నారు. పూల్ సింగ్, దుర్గ, రాజనాయిక్, నాగమణి, విజయలక్ష్మి, అశోక్ లను అరెస్ట్ చేయగా, సైదాబీ, సింధు, నరేశ్​, సరోజ పరారయ్యారు. నిందితులను రిమాండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పిల్లల్ని అమ్మడం నేరమని, శిశు విక్రయాలను ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్​పెక్టర్ వీర రాఘవులు, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, సీసీఎస్ ఎస్ఐ సాయి ప్రశాంత్ పాల్గొన్నారు.