హైదరాబాద్లో నకిలీ పత్రాలతో ఖరీదైన స్థలం అమ్మకం.. ఏడుగురు నిందితులు అరెస్ట్

హైదరాబాద్లో నకిలీ పత్రాలతో ఖరీదైన స్థలం అమ్మకం.. ఏడుగురు నిందితులు అరెస్ట్

గండిపేట్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి, అమాయకులకు స్థలాన్ని అమ్మిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్‌‌ పీఎస్​లో డీసీపీ శ్రీనివాస్‌‌ ఈ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. సోమాజిగూడకు చెందిన వినీతా చౌదరి 2005లో గండిపేట బండ్లగూడ జాగీరులోని పద్మశ్రీ హిల్స్​లో మొత్తం 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉంటోంది. 

దీంతో బాధితులు ఇక్కడకు రావడం లేదని తెలుసుకున్న గుండాల నగేష్‌‌, జి.ఎస్‌‌.ఇమ్మాన్యుయేల్‌‌ ఈ స్థలాన్ని కాజేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఈ భూమిని మోసపూరితంగా అమ్మడానికి కుట్ర పన్నారు. ఆ ప్లాట్‌‌కు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి దివాకర్‌‌ వర్మ అనే వ్యక్తికి అనుకూలంగా జనరల్‌‌ పవర్‌‌ ఆఫ్‌‌ అటార్నీని రూపొందించారు. తరువాత దానిని మూసాపేటలోని జిల్లా రిజిస్ట్రార్‌‌ ఆఫీస్​లో ధ్రువీకరించారు. ఆపై దివాకర్‌‌ వర్మ.. సుభాషినికి అనుకూలంగా రూ.63 లక్షలకు సేల్‌‌ డీడ్‌‌ను అమలు చేశాడు. 

అనతంరం సుభాషిని ఆ భూమిని వల్లి మధ్యవర్తిత్వంలో మొత్తం రూ.4.26 కోట్లకు బాధితుడు శ్రీనివాస్‌‌రెడ్డి, భరత్‌‌రెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్న మెస్సర్స్‌‌ ధ్రవంతీర కన్‌‌స్ట్రక్షన్స్​కు  విక్రయించారు. ఈ మొత్తాన్ని నిందితులు పంచుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. వీరి నుంచి రూ.1.69 కోట్ల నగదు, ఫార్చ్యూనర్‌‌, ఎస్‌‌యూవీ 700, ఎస్‌‌–క్రాస్‌‌ కార్లు, ఏడు సెల్‌‌ఫోన్లు, నకిలీ పత్రాల కాపీలను స్వాధీనం చేసుకున్నారు.