న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా ఈ ఏడాది మార్చిలో హోల్‌సేల్స్ తగ్గాయని మారుతీ సుజుకీ, హ్యుండై ప్రకటించాయి. అయితే టాటా మోటార్స్, స్కోడా, కియా, టొయోటా, మహీంద్రా అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఈసారి అమ్మకాలు గత ఐదేళ్లలో అత్యధికమని టొయోటా కిర్లోస్కర్ ప్రకటించింది. తమ కార్ల అమ్మకాలు చాలా బాగుతున్నాయని మహీంద్రా తెలిపింది. మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు గత మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో 1,55,417 యూనిట్ల నుంచి 7 శాతం తగ్గి 1,43,899 యూనిట్లకు చేరుకున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 16,52,653 యూనిట్లను అమ్మింది. ఎలక్ట్రానిక్ భాగాల కొరతను తీర్చడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని తెలిపింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మొత్తం అమ్మకాలు గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈ మార్చిలో 14 శాతం తగ్గి 55,287 యూనిట్లకు పడిపోయాయి. .
43 శాతం పెరిగిన టాటా సేల్స్
టాటా మోటార్స్ అమ్మకాలు 2021 మార్చిలో 29,654 యూనిట్ల నుండి 43 శాతం గ్రోత్తో గత నెలలో 42,293 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా గత ఏడాది మార్చిలో 16,700 యూనిట్లను అమ్మగా, ఈసారి మార్చిలో ఇవి 65 శాతం పెరిగి 27,603 యూనిట్లకు చేరుకున్నాయి. టొయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 14 శాతం పెరిగాయి. యూనిట్ల సంఖ్య 15,001 నుంచి 17,131 యూనిట్లకు పెరిగాయి. కియా సేల్స్ 18 శాతం పెరిగి 22,622 యూనిట్లకు ఎగిశాయి. స్కోడా సేల్స్ ఐదింతలు పెరిగాయి. యూనిట్ల సంఖ్య 1,159 నుంచి 5,608 యూనిట్లకు పెరిగింది. ఎంజీ మోటార్స్ అమ్మకాలు 14.5 శాతం తగ్గి 4,721 యూనిట్లకు చేరుకున్నాయి. నిస్సాన్ అమ్మకాలు కూడా 25 శాతం తగ్గి 3,007 యూనిట్లకు పడిపోయాయి. టీవీఎస్ సేల్స్ 4.55 శాతం తగ్గి 3,07,954 యూనిట్లకు పడ్డాయి.