సలేశ్వరం జాతర.. ప్రాణాల మీదికి తెచ్చిన ఆంక్షలు.. 

సలేశ్వరం జాతర.. ప్రాణాల మీదికి తెచ్చిన ఆంక్షలు.. 
  • ఏర్పాట్ల పట్ల భక్తుల అసహనం

అచ్చంపేట/ అమ్రాబాద్, వెలుగు: నల్లమల్ల సలేశ్వరం యాత్ర శుక్రవారం సాయంత్రానికి ముగిసింది. ఫారెస్ట్​ అధికారుల నిబంధనలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో వారం పాటు కొనసాగే లింగమయ్య జాతరను వివిధ కారణాలు, ఆంక్షల నడుమ మూడు రోజులకు కుదించారు. దీంతో భక్తులు లక్షల సంఖ్యలో వచ్చారు. రద్దీని కంట్రోల్​ చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఇరుకైన లోయలో  విపరీతమైన రద్దీతో గురువారం తొక్కిసలాట జరిగింది. రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గురువారం పౌర్ణమి, శుక్రవారం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. శుక్రవారమూ భక్తుల రద్దీ తగ్గలేదు. ఈ నెల9 వరకు సలేశ్వరానికి వెళ్లేందుకు ఫారెస్ట్​ఆఫీసర్స్​పర్మీషన్​ఇస్తారనే భక్తుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. శుక్రవారం సాయంత్రం 5 తర్వాత భక్తులను అడవిలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  

ఫలించని కలెక్టర్​రివ్యూ..

సలేశ్వరం జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్​ఉదయ్​కుమార్​వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. వచ్చే భక్తులకు కనీస ఏర్పాట్లతో పాటు తాగునీరు, వైద్యం, ఫైర్, లైటింగ్​తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రోజూ 30 ట్రాక్టర్ల ద్వారా 30 సిన్టెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పించాలని ఆదేశిస్తే అధికారులు చుక్కనీరు దొరకుండా చేశారు. మధ్యలో గోలి సోడాలు అమ్ముకునే వారు బాటిల్ కు రూ.40 వసూలు చేశారని భక్తులు వాపోయారు. రాంపూర్​పెంట దాటిన తర్వాత మైదాన ప్రాంతం, లోయలోకి దిగే వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఎక్కడా తాగునీటి సౌకర్యం కల్పించలేదు. అన్నదానం చేసే సంస్థల నుంచి ముందుగానే రూ.50 వేలు డిపాజిట్​కట్టించుకున్నారు. మూడు చోట్ల హెల్త్​క్యాంపులు ఏర్పాటు చేయాలని, లోయలో డాక్టర్, టీమ్​ఉండాలని కలెక్టర్​ఆదేశించారు. కానీ తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో ఎలాంటి వైద్య సదుపాయం కల్పించలేదు. ట్రైబల్​వెల్ఫేర్​డిపార్ట్ మెంట్​నడకదారిలో సోలార్​లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా కొంత దూరం వరకే వేసి వదిలేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పైన సిబ్బంది ఉన్నా లోయలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. అన్నదానం శిబిరాల దగ్గరే హెల్త్​ క్యాంపులు ఏర్పాటు చేశారు. సిబ్బంది కొరత, విపరీతమైన రద్దీతో తోపులాటలో ఊపిరి అందక ఇద్దరు మరణించగా మరికొందరు గాయాలయ్యాయి. చాలా మంది భక్తులు సలేశ్వరం వరకు వెళ్లే  పరిస్థితి లేకపోవడంతో లోయలోకి దిగి లింగమయ్యను దర్శించుకోకుండానే వెనుదిరిగారు.

టోల్‌ వసూల్​పైనే ధ్యాస..

సలేశ్వరం చేరేందుకు శ్రీశైలం ప్రధాన రోడ్డులోని ఫర్హాబాద్‌ చెక్‌పోస్టు నుంచి అటవీమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లాలి. ఇందుకు అటవీశాఖ అధికారులు బైకులకు రూ.100, ఆటోలకు రూ.300, కార్లకు రూ.500, భారీ వాహనాలకు రూ.1,000 చొప్పున టోల్‌ రుసుం వసూలు చేశారు. గురువారం ఘటన తర్వాత వెహికిల్స్ ను కంట్రోల్​చేయడంపై దృష్టి సారించారు. ఏటా లింగమయ్య దర్శనానికి వచ్చే భక్తులకు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వసతులు, బారీ కేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేవారు. ఈసారి జాతరను కుదించడంపై చూపించిన ఇంట్రెస్ట్​ ఏర్పాట్లపై పెట్టలేదన్న విమర్శలు వచ్చాయి. చిన్న పిలల్లు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్లాస్టిక్​వాడకం నిషేధంపై కఠినంగా వ్యవహరించిన ఫారెస్ట్​అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు.

లింగాల పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు..

సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వెళ్లిన చంద్రయ్య మృతిపై అతని తమ్ముడు సహదేవ్​ఇచ్చిన ఫిర్యాదుతో లింగాల పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ మృతిపై  ఫిర్యాదు రాలేదని తెలిపారు.