ప్రకృతి సోయగాల మధ్య వెలసిన క్షేత్రం సలేశ్వరం

 ప్రకృతి సోయగాల మధ్య వెలసిన క్షేత్రం సలేశ్వరం

లింగాల,  వెలుగు: నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య వెలసిన క్షేత్రం సలేశ్వరం. నింగి నుంచి నేలకు జారుతూ గుండంలోకి నీరు చేరతాయి. అక్కడి నీళ్లు మండు టెండల్లో  స్వామిని దర్శించుకోవడం ఎంతో సాహసంతో కూడిన పని.  అత్యంత ప్రమాదకరంగా కొండ చరియల పై నడుస్తూ లింగమయ్య లోయకు చేరుకోవాలి.  సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి పౌర్ణమికి ఒక రోజు ముందు, ఒక రోజు వెనుక మొత్తం మూడు రోజులు జరుగుతుంది. అక్కడ కొంత మంది దాతలు ఉచిత భోజన వసతి కల్పిస్తారు.

ప్రకృతి అందాలకు నిలయం 

భక్తులు వచ్చేటప్పుడు 'వత్తన్నం వత్తన్నం లింగమయ్య అంటూ వస్తారు. పోయేటప్పుడు పోతున్నం పోతున్నాం లింగమయ్య అని అరుస్తూ నడుస్తుంటారు.  ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. ఆ ప్రదేశానికి పరహబాద్ అని పేరు పెట్టాడు. అంటే అందమైన ప్రదేశం అని అర్థం. అంతకుముందు దానిపేరు పుల్ల చలమల అని అనేవారు. 1773లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణా కేంద్రం ఇది.  నిజాం విడిది నుంచి ఎడమవైపు 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు ఎత్తయిన గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్యలో లోతైన లోయ లోనికి జలధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అరకిలోమీటరు దిగిన తర్వాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్టపైన కిలోమీటర్ దూరం నడవాలి.  

ఆ గుట్ట కొలను చేరుకున్నాక మళ్లీ ఉత్తర వైపునకు తిరిగి గుట్టల మధ్య లోయలోనికి దిగాలి. ఆ దారిలో వెళితే గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. గుండం నుంచి పారే నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. గుండం బొడ్డు పైన తూర్పుముఖంగా 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి.  పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి విగ్రహం ఉంది.  స్థానిక చెంచులే ఇక్కడి పూజారులు.  కింద గుహలో లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు గంగమ్మ విగ్రహాలు ఉంటాయి.

ఇలా వెళ్లొచ్చు... 

నల్లమల్ల అడవుల్లో వెలిసిన లింగమయ్య, సలేశ్వర ఉత్సవాలకు వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం లోని అప్పాయిపల్లి గ్రామం మీదుగా కాలి నడకతో పాటు ట్రాక్టర్ల ద్వారా కొండగుట్టల పై నుంచి సలేశ్వరం చేరుకోవచ్చు. మరో దారి  నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి  శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి మీదుగా మన్ననూర్ నుంచి 15  కిలోమీటర్ల దూరంలో ఉన్న పరహబాద్ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి పూర్తిగా దట్టమైన అడవుల్లో 30  కిలోమీటర్ల దూరం తర్వాత,  మరో రెండు కిలోమీటర్ల దూరం ఆటోల ద్వారా వెళ్లే ప్రధాన మార్గం వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన కొండలు గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడి చేరాలి. సలేశ్వర జాతరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.