ఏప్రిల్ 11 నుంచి సలేశ్వరం జాతర .. భారీగా తరలిరానున్న భక్తులు

ఏప్రిల్ 11 నుంచి సలేశ్వరం జాతర .. భారీగా తరలిరానున్న భక్తులు
  • నల్లమల అడవుల్లో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్య
  • శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జాతర

లింగాల, వెలుగు : తెలంగాణ అమర్‌‌‌‌నాథ్‌‌‌‌గా పేరుగాంచిన, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరం జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రారంభమయ్యే జాతర మూడు రోజుల పాటు సాగనుంది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వెయ్యి అడుగుల లోతు లోయలో ఉన్న లింగమయ్యను దర్శించుకోనున్నారు. 

లింగమయ్యను చూడాలంటే... సాహసం చేయాల్సిందే..

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా లింగాల మండలంలోని దట్టమైన అడవిలో జరిగే సలేశ్వరం జాతరకు వెళ్లాలంటే గుట్టలు, లోయల్లో సాహసం చేయాల్సిందే. అత్యంత ప్రమాదకరంగా ఉండే కొండ చరియలు, కేవలం ఒక పాదం పట్టే అంత ఉన్న ప్లేస్‌‌‌‌లో నడుస్తూ సుమారు వెయ్యి అడుగుల లోతున్న లోయలోకి దిగాల్సి ఉంటుంది. అక్కడ రెండు గుహలు ఉండగా ఒకదాంట్లో లింగయ్య కొలువై ఉన్నాడు. ఇక్కడ స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తుంటారు. 

ప్రధాన ఆలయం ఎదుట వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు సైతం ఉన్నాయి. రెండు కొండల మధ్య సుమారు 280 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేస్తే సర్వరోగాలు మాయం అవుతాయని భక్తుల నమ్మకం. చుట్టూ ఎత్తైన కొండల మధ్య గుహలో కొలువైన లింగమయ్యను దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. భక్తులకు అత్యవసర సమాయాల్లో సేవలు అందించేందుకు రాంపూర్‌‌‌‌ పెంట, సలేశ్వరం లోయ వద్ద హెల్త్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లను ఏర్పాటు చేశారు.

సలేశ్వరం చేరుకోవడం ఇలా...

  • నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి నుంచి గోర్జా గుండాల వరకు ట్రాక్టర్లు,  బైక్‌‌‌‌ల ద్వారా వెళ్లవచ్చు. అక్కడి నుంచి గుట్టలపైకి సుమారు 6 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి.మరో మార్గంలో.. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా అమ్రాబాద్‌‌‌‌ మండలంలోని మన్ననూర్‌‌‌‌ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి శ్రీశైలం – హైదరాబాద్ హైవే మీదుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్హాబాద్‌‌‌‌ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్‌‌‌‌ పెంట, అప్పాపూర్‌‌‌‌ పెంటకు చేరుకోవాలి. ఇక్కడి నుంచి ఆటోల ద్వారా మరో రెండు కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తే సలేశ్వరం చేరుకోవచ్చు. అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేకంగా బస్సులను సైతం ఏర్పాటు చేశారు. అచ్చంపేట నుంచి ఫస్ట్‌‌‌‌ బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుండగా చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఈ బస్సు ద్వారా అప్పాపూర్‌‌‌‌ పెంటకు చేరుకొని అక్కడి నుంచి ఆటో ద్వారా సలేశ్వరం వెళ్లవచ్చు.
  • సొంత వాహనాల్లో వెళ్లే వారు ఫర్హాబాద్‌‌‌‌ నుంచి ఎడమవైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్తే సలేశ్వరం బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ వస్తుంది. అక్కడ వాహనాలను ఆపుకొని రెండు కిలోమీటర్ల నడిచి సలేశ్వరం చేరుకోవచ్చు.