దేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‎గా శాలిబండ పీఎస్‎

హైదరాబాద్‎లోని శాలిబండ పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేసుల పరిష్కారం, ఇతర అంశాల ఆధారంగా  దేశంలోని 8వ ఉత్తమ పోలీస్ స్టేషన్‎గా శాలిబండ పీఎస్‎ను కేంద్ర హోం శాఖ ఎంపిక చేసింది. భువనేశ్వర్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక డీజీపీఐజీపీ  కాన్ఫరెన్స్‌లో శుక్రవారం (నవంబర్ 29) ఈ విషయాన్ని ప్రకటించారు. శాలిబండ పోలీస్ స్టేషన్‎కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై తెలంగాణ డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  నివేదిక ప్రకారం శాలిబండ పోలీస్ స్టేషన్ దేశంలోని 8వ ఉత్తమ పీఎస్‎గా ఎంపికైందని తెలిపారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థకు ఈ గుర్తింపు మరింత ప్రతిష్టను తీసుకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, శాలిబండ పోలీస్ స్టేషన్ బృందానికి డీజీపీ జితేందర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.