అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 14 న పండగ జరగనుంది. అది మాములు పండగ కాదు దేశమంతా కలిసి కట్టుగా జరుపుకునే పండగ. ఆ రోజు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ సమరం జరగబోతుంది. ఈ మ్యాచుకు స్టేడియాలు నిండిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అంతే కాదు పలు సెలబ్రిటీలు ఈ మ్యాచు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, సచిన్ టెండూల్కర్ లాంటి ప్రముఖులు ఈ మ్యాచు చూసేందకు వస్తుంటే ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేరిపోయాడు. అయితే సల్మాన్ ఈ మ్యాచుకు రావడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తుంది.
టైగర్ 3 ప్రమోషన్ కోసం
టైగర్ 3 మేకర్స్..ఈ సినిమా ప్రమోషన్స్‌ను వినూత్నంగా చేపట్టనున్నారు. ఎంతో ఉత్కంఠ రేపే భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లో..టైగర్ 3 మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందుకోసం వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ అయిన యశ్ రాజ్ ఫిల్మ్స్ చేతులు కలిపింది. దీంతో వరల్డ్ కప్ మ్యాచ్ అంతా సల్మాన్ టైగర్3 ట్రైలర్ ప్రమోషన్స్‌తో నిండిపోనుందని సినీ క్రిటిక్స్ తెలిపారు. టైగర్ 3 మూవీ టీమ్ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందంటూ..అటూ సినిమా ఫ్యాన్స్..ఇటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో టైగర్ 3 మూవీ ప్రమోషన్స్ కు భారీ స్థాయిలో జరిగేటట్లు తెలుస్తోంది.
11వేల మందితో భద్రత
ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. 48 గంటల పాటు అహ్మదాబాద్ నగరం మొత్తం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోనుంది. 11 వేల మందితో ఈ మ్యాచ్ కు భద్రత కల్పించనున్నారు. ఇందులో స్థానిక పోలీసులు, హోమ్ గార్డులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండనున్నారు. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ సంబంధ దాడులను కూడా అడ్డుకునేలా భద్రతా సిబ్బందిని భారీగానే మోహరిస్తున్నారు.