
ముంబై: దేవుడు తనకు ఇచ్చిన ఆయుష్షు ఉన్నంత కాలం(అల్లా ఎంత రాసి పెట్టి ఉంటే అంత) బతుకుతానని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు వస్తున్న హత్య బెదిరింపులపై సల్మాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. సల్మాన్ ఖాన్నటించిన సికందర్ సినిమా ప్రమోషన్లో భాగంగా బుధవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను దేవుడిని నమ్ముతానని, తన జీవితం దేవుని చేతిలో ఉందని.. ఆయనే అన్నీ చూసుకుంటాడని అన్నారు.
హత్య బెదిరింపులతో తన ఇంటి వద్ద, షూటింగ్ లొకేషన్స్ లో భద్రత పెరిగిందని, కొన్ని సార్లు ఈ భద్రత కూడా తనకు సవాలుగా అనిపిస్తోందని సల్మాన్పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల అతని సన్నిహితుడు, పొలిటీషీయన్ బాబా సిద్ధిక్ మరణం తర్వాత సల్మాన్‌కు ప్రభుత్వం భద్రతను పెంచింది. కాగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్, రష్మిక మందన్న నటించిన యాక్షన్ చిత్రం సికందర్ ఈ నెల 30న(ఆదివారం) విడుదల కానుంది.
సల్మాన్ చేతికి రామ జన్మభూమి వాచ్.. ధర సుమారు రూ. 34 లక్షలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరికొత్త వాచ్‌తో దర్శనమిచ్చారు. దానిని రామ జన్మభూమి కాన్సెప్ట్‌తో డిజైన్ చేశారు. 'ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి రోజ్ గోల్డ్ ఎడిషన్' పేరుతో ఈ అద్భుతమైన టైమ్ పీస్ లగ్జరీ బ్రాండ్ జాకబ్ అండ్ కో నుండి వచ్చింది. దాని ధర రూ. 34 లక్షలు. ఆ వాచ్‌లో అయోధ్య రామాలయం, శ్రీరాముడు, హనుమంతుడు, ఇతర చిహ్నాలు ఉన్నాయి. నీలి రంగు చొక్కా ధరించి, కాషాయ రంగు గల వాచ్‌ను చూపిస్తూ ఉన్న ఫొటోను సల్మాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దానికి "మార్చి 30న థియేటర్లలో కలుద్దాం" అని క్యాప్షన్ పెట్టారు.