ఉప్పు లేకపోతే ఏ వంటకం అయినా రుచిగా ఉండదు. అలాగని ఎక్కువ వాడితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఉప్పును పొదుపుగా వాడాలి అంటారు హెల్త్ ఎక్స్పర్ట్స్. అయితే అలా చేయడం చాలామందికి సాధ్యం కాదు. ఉప్పు మోతాదు తగ్గించాలి అనుకుంటారు. కానీ, వంట చేసేటప్పుడు ఎప్పటిలానే వేస్తుంటారు. మరెలా? అందుకే ఈ ఉప్పు తిప్పలు తప్పించేందుకు సైంటిస్ట్‌లు ఒక సొల్యూషన్ కనిపెట్టారు. అదే ఎలక్ట్రిక్ స్పూన్.
జపాన్‌లో ప్రత్యేకమైన బ్యాటరీతో పనిచేసే స్పూన్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. ప్లాస్టిక్, మెటల్‌తో ఈ స్పూన్ తయారైంది. ఈ ఎలక్ట్రిక్ స్పూన్ ఫుడ్‌ని దానంతటదే ఉప్పగా మార్చేస్తుంది. దీన్ని మిజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హోమి మియాషితా, తోటి సైంటిస్ట్‌లతో కలిసి డిజైన్ చేశారు. ‘‘సోడియం ఎక్కువగా శరీరంలోకి చేరితే బీపీ, స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. జపాన్‌లో పెద్దవాళ్లు రోజుకు సగటున10 గ్రాముల ఉప్పు తింటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దానికంటే ఈ మోతాదు రెండింతలు ఎక్కువ. అందుకే ఈ సొల్యూషన్ కనిపెట్టాం” అన్నారు వాళ్లు.
అవార్డ్ గెలిచిన స్పూన్
ఈ ఎలక్ట్రిక్ స్పూన్ బరువు 60 గ్రాములు. ఇది ఫుడ్లోని ఉప్పును ఒకటిన్నర శాతం పెంచుతుంది. దానివల్ల వంటల్లో ఉప్పు తక్కువ వాడతారు. లిథియం బ్యాటరీతో పనిచేసే ఈ స్పూన్‌ను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్పూన్ హెల్దీ ఫుడ్‌ని ఎంకరేజ్ చేస్తుందని సైంటిస్ట్‌లు చెప్తున్నారు. ఈ స్పూన్ టెక్నిక్ 2023లో ఐజీ నోబెల్ అవార్డ్ కూడా గెలుచుకుంది.
దీని ధర19, 800 యెన్లు. అంటే ఇండియన్ కరెన్సీలో10, 469 రూపాయలు.