ఆకాశాన్నంటే పర్వత శిఖరాలు... ఏడాదంతా కళకళలాడే సరస్సు...
ఆ నీటిలో ఒక పక్క బోటింగ్, మరో పక్క హంసల సందడి...
కొండలను ఆనుకుని, సరస్సు ఒడ్డున కొలువుదీరిన ఇండ్లు...
కాలుష్యం జాడ లేని వాతావరణం... వెయ్యి కూడా దాటని జనాభా...
ఇలాంటి అందాల ఊళ్లో ఒక ఉప్పు గని ఉంది.
పేరుకి అది ఉప్పు గనే.. కానీ, అక్కడి వాళ్లకది బంగారు గని..
ఆస్ట్రియాలోని మండేన్ జిల్లాలో ఉన్న హాల్‌స్టాట్ అనే చిన్న గ్రామం అది. ఈ ఊరు నార్తర్న్ లైమ్‌స్టోన్ ఆల్ప్స్లో ఉన్న డచిస్టెయిన్ మాసిఫ్ అనే రెండో అతిపెద్ద పర్వతానికి, నైరుతి వైపున ఉన్న హాల్స్టాటర్ సరస్సు ఒడ్డు మధ్యన ఉంది. ఇంకా చెప్పాలంటే... సాల్జ్కామ్మెర్గట్ అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఆస్ట్రియా రాజధాని గ్రాజ్కి, సాల్జ్ బర్గ్ అనే సిటీని కలిపే నేషనల్ రోడ్ ఉంది. ఇదంతా పక్కన పెడితే... ఈ ఊరికి ఏడు వేల ఏండ్లనాటి చరిత్ర ఉందనేది చెప్పుకోవాల్సిన విషయం. హాల్ స్టాట్‌లో జనాభా వెయ్యిలోపే. కచ్చితంగా చెప్పాలంటే దాదాపు ఎనిమిది వందల మంది మాత్రమే. కానీ, ఏటా అక్కడికి వచ్చే టూరిస్ట్‌లు మాత్రం లెక్కపెట్టలేనంతమంది. సంవత్సరానికి లక్షమందికి పైగా విజిటర్స్ వచ్చే ప్లేస్ ఇది. అయితే... కరోనా టైంలో మాత్రం టూరిస్ట్‌ల రాక తగ్గింది. ఇక్కడ రెస్టారెంట్లు, హోటల్స్, హోం స్టేలు చాలా తక్కువ. మామూలుగా టూర్‌కి వెళ్తే రెండు మూడు రోజులు పడుతుంది. అయితే హాల్స్టాట్కి వెళ్తే ఒక్కరోజులోనే ఊరు మొత్తం చూసేయొచ్చు. కార్లో తిరిగి చూడటం కంటే హ్యాపీగా నడుచుకుంటూ తిరిగి రావొచ్చు. ఒక కారు పట్టేంత స్థలం మాత్రమే ఉంటుంది ఆ రోడ్ల మీద. ఇక్కడ సరస్సులో, చుట్టుపక్కల హంసలు సందడి చేస్తుంటాయి.
హంసలు ఇక్కడికి ఎలా వచ్చాయనే... దానికి ఓ కథ ఉంది. ఆస్ట్రియా దేశ రాణి సిసి,1860లో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లేటప్పుడు హంసల్ని తెప్పించుకుంది. ఆమె బంధువు బవేరియా రాజు లుడ్విగ్కి కూడా హంసలంటే చాలా ఇష్టమట. వాళ్లిద్దరూ వాటిని ఎంతో ఇష్టంగా చూసుకునేవారట. అప్పటి నుంచి అవి ఇక్కడే ఉండి, వాటి సంతానాన్ని పెంచాయని చెప్తారు.
ఇక్కడ హంసలతోపాటు గుడ్లగూబలు కూడా చాలానే ఉంటాయి. అవి బాల్కనీల్లో, తలుపుల మీద ఇలా ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటాయి.1785 నాటి ఇవాంజిలికల్ చర్చ్ కూడా ఉంది ఈ ఊళ్లో. అది కూడా చూడదగ్గ ప్రదేశమే. అంతేకాదు, ఇక్కడ ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడి వాళ్లు దానితోనే వ్యాపారం చేస్తారు. రకరకాల ఉప్పులతో సోప్స్, పౌడర్స్ వంటి ప్రొడక్ట్స్ తయారుచేస్తారు. అంతేకాదు, అక్కడ దొరికే రంగు రంగుల ఉప్పు కళ్ళని ఒక్కోటి ఇంత అని అమ్ముతారు. అవి చూడ్డానికి వెరైటీగా, సముద్రంలో దొరికే క్రిస్టల్ లాంటి డిజైన్లను పోలి ఉంటాయి. ఇక్కడికి వచ్చినవాళ్లు వాటిని తీసుకెళ్తుంటారు. వీటితోపాటు హాల్ స్టాట్ ఏ సీజన్లో ఎలా ఉంటుందో చూపించడానికి అనేవి గ్లాస్ డెకరేటివ్ ఐటమ్స్తయారుచేస్తారు.
ప్రత్యేకత ఏంటి?
హాల్‌స్టాట్ అనగానే ఆస్ట్రియా ప్రజలకు గుర్తొచ్చేది ఉప్పు. చరిత్రకు ముందు నుంచే ఆ ఊళ్లో ఉప్పు తయారుచేసేవాళ్లు. అది హాల్‌స్టాట్ కల్చర్‌గా పిలిచేవాళ్లు. ఆర్కియాలజికల్ రిపోర్ట్స్ ప్రకారం, అక్కడ ఇనుప యుగానికి ముందు తరంలో ఇండో యూరోపియన్లు ఉండేవాళ్లని అంచనా. దీన్ని1997లో ఆస్ట్రియాలోని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో ప్రకటించింది. 2006లో తూర్పు ఆసియాకు చెందిన టూరిస్ట్‌ల కారణంగా ఇది బాగా పాపులర్ అయింది. చలికాలంలో మంచు గడ్డ కట్టడం వల్ల, చూసేందుకు డిస్నీ ల్యాండ్లా కనిపిస్తుందని... సౌత్ కొరియా టెలివిజన్ షోలో చూపించారు. ఆ తర్వాత ఆ ఫొటోలు చాలా ఫేమస్ అయ్యాయి.
ఉప్పు గని
ప్రపంచంలోనే వాడుకలో ఉన్న పురాతన సాల్ట్ మైన్ ఇదే. ఈ మైన్ నార్తర్న్ లైమ్‌స్టోన్ ఆల్ఫ్స్లో ఉంది. మూడు కిలో మీటర్ల దూరం ఉంటుంది ఇది. టూరిస్ట్‌లు ఈ మైన్‌లోకి వెళ్లొచ్చు. కాకపోతే మూడొందల యాభై మీటర్ల దూరం వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి వెనక్కి రావాలి. గుహలా ఉండే ఈ గని లోపలికి వెళ్లడానికి దారి ఉంది. అలాకాకుండా జారుడు బల్ల నుంచి జారుకుంటూ కూడా వెళ్లొచ్చు. అలా జారేందుకు పెద్దవాళ్లకు, చిన్నపిల్లలకు వేరువేరుగా జారుడు బల్లలు ఉన్నాయి. ఉప్పు గని గురించి, ఆ కాలంనాటి ప్రజలకు ఎలా తెలిసింది? ఆ తర్వాత ప్రజలు ఉప్పుని ఎలా వ్యాపారంగా మార్చారు? వంటి అంశాలు, ఊరి చరిత్రకు సంబంధించిన సంగతులన్నీ యానిమేషన్ వీడియో షో వేసి చూపిస్తారు.
స్కై వాక్
సరస్సు పైన 360 మీటర్ల ఎత్తులో ఒక బ్రిడ్జ్లాంటి నిర్మాణం ఉంది. ఇది వ్యూపాయింట్ లాంటిది. దాని మీదకు వెళ్తే చుట్టూ ఉన్న పర్వత శ్రేణుల అందాల్ని తనివితీరా చూడొచ్చు. ఈ ప్లేస్‌ని హాల్‌స్టాట్ స్కైవాక్ అంటారు.
ఎముకల గూడు
అద్భుతంగా పెయింటింగ్ వేసిన 600 రకాల పుర్రెలు ‘బోన్ హౌస్’లో కనిపిస్తాయి. వాటిలో చాలావరకు 18వ శతాబ్దంలో పెయింట్ చేసినవే. కొన్ని మాత్రం 20 వ శతాబ్దంలో వేసినవి. ఆ పుర్రెలకు పెయింట్ వేసేది కూడా చనిపోయిన వాళ్ల కుటుంబ సభ్యులే. పెయింటింగ్‌తో పాటు వాళ్ల పేర్లు కూడా ఉంటాయి.
అచ్చం ఇలాంటిదే చైనాలో..
హాల్‌స్టాట్ ప్రకృతి అందాలు, దాని విశేషాలకు ఫిదా అయిన చైనా.. తమ దేశంలో కూడా అచ్చం అలాంటి ఊరినే కట్టాలనుకుంది. అనుకున్నట్టే 2011లో హాల్ స్టాట్ని పోలిన ఊరు కట్టడానికి చైనా రెడీ అయినట్టు వార్తలొచ్చాయి కూడా. 2012లో చైనా మైనింగ్ కంపెనీ అయిన చైనా మిన్మెటల్స్ కార్పొరేషన్ వాళ్లు గ్వాన్డాంగ్ ప్రావిన్స్‌లోని హుయిజోలో హాల్‌స్టాట్ ఊరిని కడుతున్నారన్నారు.
చరిత్ర
1846, ఆస్ట్రియన్ మైన్ ఆపరేటర్, హాల్‌స్టాట్ శ్మశాన వాటిక తవ్వకాలకు డైరెక్టర్‌గా జొహాన్ జార్జ్ రామసియర్ అనే అతను పనిచేశాడు. ఆ టైంలోనే హాల్ స్టాట్కి దగ్గర్లో ఉన్న సాల్జ్బెర్గ్ మైన్స్‌లో ఒక పెద్ద ప్రి–హిస్టారిక్ శ్మశాన వాటిక కనుగొన్నాడు జొహాన్. ఆ తవ్వకాల్లో ఒక వెయ్యి నలభై ఐదు శవాలు బయటపడ్డాయి. వాటి దగ్గర కనిపించిన వస్తువుల్ని బట్టి వాళ్లు ఎవరనేది కనిపెట్టారు. అలా మొట్టమొదటిసారి హాల్ స్టాట్లోని సాల్ట్ మైన్స్ గురించి తెలిసింది. ఆ తర్వాత కూడా ఎన్నో తవ్వకాలు జరిగాయి. తవ్వకాల్లో దొరికిన వస్తువుల్ని, అస్థిపంజరాల్ని జర్మనీ, ఆస్ట్రియా మ్యూజియాల్లో భద్రపరిచారు. వీటితోపాటు హాల్స్టాట్లోనే పెద్ద మ్యూజియం ఒకటి ఉంది. అందులో చాలా విశేషాలున్నాయి.
ఇలా వెళ్లాలి
మనదేశంలో ఢిల్లీ, ముంబై నుంచి ఆస్ట్రియాలోని వియన్నా లేదా సాల్జ్ బర్గ్‌కి ఫ్లైట్, ట్రైన్ రెండింటిలో ఎలా అయినా వెళ్లొచ్చు. పాతిక వేల నుంచి లక్ష రూపాయలలోపు ఖర్చవుతుంది. సాల్జ్ బర్గ్ నుంచైతే... హాల్స్టాట్కి బస్‌లో వెళ్తే రెండుంబావు గంటలు, ట్రైన్లో వెళ్తే రెండున్నర గంటలు పడుతుంది. అయితే బస్, ట్రైన్ ఏదైనా డైరెక్ట్‌గా వెళ్లదు. మధ్యలో మరొకటి మారాలి. వియన్నా నుంచైతే... ట్రైన్లో వెళ్లొచ్చు. సాల్జ్ బర్గ్ నుంచి వెళ్లే ట్రైన్ ఎక్కడ ఆగుతుందో.. ఇది అక్కడే ఆగుతుంది. అక్కడి నుంచి మరో ట్రైన్ ఎక్కాలి.