
- గుర్రాల వల్ల 28, ఉప్పు వల్ల 11 మంది సేఫ్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. కానీ, అదే టైంలో అక్కడ ఉండాల్సిన మరో 39 మంది ఆలస్యం వల్ల మరణం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సాల్టీ మటన్ రోగన్ జోష్ 11 మందిని, గుర్రాల ఆలస్యం 28 మందిని, భేల్‌పూరీ తినేందుకు ఆగిన క్షణాలు ఒక జంట ప్రాణాలను కాపాడాయి. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి నుంచి 11 మంది సభ్యులతో కాశ్మీర్ వచ్చిన ఓ ఫ్యామిలీ కాసేపట్లో బైసరాన్ చేరుకుంటామనగా..ఓ రెస్టారెంట్ వద్ద ఆగింది.
వారు ఆర్డర్ చేసిన మటన్ రోగన్ జోష్ లో ఉప్పు ఎక్కువయింది. దాంతో రెస్టారెంట్ సిబ్బంది స్పందించి..మళ్లీ కొత్తగా వండి ఇవ్వడంతో ఒక గంట ఆలస్యమైంది. ఈ ఆలస్యం వల్ల వారు బైసరాన్‌కు చేరే సమయానికి దాడి జరిగిపోయింది. గుర్రాలు వెనక్కి పరిగెత్తడం చూసిన కుటుంబం.. స్థానిక డ్రైవర్ సలహా మేరకు వెనక్కు వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకుంది. "సాల్టీ మటన్ రోగన్ జోషే..దేవుడు రూపంలో తమను కాపాడిందని ఆ కుటుంబం మీడియాకు తెలిపింది.
జంటను కాపాడిన భేల్‌పూరీ స్నాక్
జైపూర్‌కు చెందిన నవదంపతులు మిహిర్, కోమల్ సోనీ బైసరాన్ లో భేల్‌పూరీ తినేందుకు ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ భేల్‌పూరీ తింటుంటే అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. దాంతో వారు పరిగెత్తుకుంటూ గుర్రంపై ఎక్కి వెనక్కి వచ్చేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. స్నాక్ బ్రేక్ తీసుకోవడం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని మిహిర్ మీడియాకు చెప్పారు.