భారతదేశంపై ఉగ్రవాద సంస్థతో దాడికి పాల్పడిన మన శత్రు దేశం అయిన పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేక మన భారత సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో ఫిబ్రవరి 14, 2019 మధ్యాహ్నం గం. 3.20 ని॥లకు ఆయుధ దాడి చేసి 40 మంది సైనికులను అమరులను గావించింది. 48 మంది సైనికులను తీవ్రమైన గాయాలపాలు చేసింది.
జైషే కుట్ర
భారత నిఘా వ్యవస్థకు ఆరు రోజుల ముందే అంటే ఫిబ్రవరి 8 నాడే ఏదో దాడి జరగబోతుంది అన్న పక్కా సమాచారం అందింది. ఆ సమాచారంతో జమ్ము కాశ్మీర్లో భద్రత మరింత పెంచారు. అప్పటికే సమాచారం అందిన మరునాడే అఫ్జల్ గురుని ఉరి తీసి ఏడాది కావస్తున్నందున భద్రతా సిబ్బందిని అలెర్ట్ చేశారు. ఈ దాడి కోసం 21 మంది ఉగ్రవాదులను అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలతో 2018 డిసెంబర్ లో సాంబ సొరంగ మార్గం ద్వారా భారతదేశ భూభాగంలోనికి చొరబడ్డారు. కాశ్మీర్ రాష్ట్ర యువకుడైన అదిల్ అహ్మద్ డార్ను ఆహుతి దాడి జరపవలసిందిగా జెఇఎమ్ సంస్థ హెచ్చరించింది. ఈ దాడికి జెఇఎమ్ సంస్థ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉపయోగించారు.
దాడి చేసిన విధానం..
ఈ దాడికి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌తో పాటు కొన్ని 1990- –96లో రిజిస్ట్రేషన్ కల్గిన పాత కారులను కొన్నారు. ఆ వాహనాలను ఎవరి దగ్గర కొన్నారు అని పరిశీలించగా, విస్ఫోటన స్థలంలో కారు యొక్క ఇంజన్ నెంబర్ ఆధారంగా కారు అసలు యజమాని ఎవరో కనుగొన్నారు. పథకం ప్రకారం పుల్వామాలోని విస్ఫోటన స్థలానికి కేవలం 5 నుండి 7 కిలోమీటర్ల దూరంలోనే రాత్రికి రాత్రే మారుతీ వ్యాన్ లో 80 కిలోల మిలటరీ హైగ్రేడ్ ఆర్డిఎక్స్ నింపారు. దానితో పాటు ఐఇడి పరికరం కూడా ఆ కారుకు అమర్చి దానిని ఒక రిమోట్ సహాయంతో పేల్చాలనుకుని అదేవిధంగా దాడి జరిపారు. ఈ దాడికి ముందు ఆహుతి దళ సభ్యుడైన డార్ చేసిన 7 నిమిషాల మరణ సందేశానికి సంబంధించిన వీడియోలు లభించాయి.
40 మంది అమరులైనారు
2019 ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం బస్సులలో 2,547 మంది సైనికులు జమ్ము - శ్రీనగర్ రహదారి వెంబడి ప్రయాణిస్తున్నారు. మామూలుగా ఈ 271 కిలోమీటర్ల ప్రయాణాన్ని సైనికులు భయంకర ప్రయాణం అంటారు. దాడి జరగవచ్చు అన్న సమాచారంతో సైనికులు ప్రయాణించే రహదారిలో సీఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు నిర్వహించాయి. దాడికి 15 నిమిషాల ముందు కొంతమంది దుండగులు సైనికుల వాహనాలపై రాళ్ళు రువ్వారు. ప్రొటోకాల్ ప్రకారం భారత సైన్యం ప్రయాణించే కాన్వాయ్ మార్గంలో వేరే ఇతర స్థానిక వాహనాలు ప్రయాణించడం నిషేధం. కాని అక్కడ స్థానికుల ఇబ్బంది దృష్ట్యా స్థానిక వాహనాలను కూడా అనుమతించారు. ఈ విషయాన్ని అనువుగా చేసుకొని, 3.15 నిమిషాలకు సైనికుల కాన్వాయ్ శ్రీనగర్‌కి 80 కిలోమీటర్ల దూరంలో వున్న పుల్వామా జిల్లా అవంతిపురా దగ్గర లటూమెడ్ జంక్షన్కి చేరుకోగానే ఆర్డిఎక్స్ నింపియున్న కారు కాన్వాయ్ మధ్యలో దూరి సరిగ్గా సీఆర్పీఎఫ్ సైనికులు వున్న వాహనం వెనక్కి వచ్చి అతి వేగంగా వాహనాన్ని గుద్ది పేల్చేశారు. ఆ పేలుడు ధాటికి మన భారత సైనికులు 40 మంది బలైనారు. 48 మంది గాయాలపాలైనారు. ఈ హింసా చర్యకి ప్రతిచర్యగా భారత వాయుసేన బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిపి జెఇఎమ్ ఉగ్రస్థావరాలను పేల్చేసి పాకిస్తాన్ కు చెప్పింది.
- ఆర్.అక్షయ్ కుమార్, ఓయూ