కారణాలేవైనా కావొచ్చు మహిళలు అనేక రంగాల్లో వెనకే ఉంటున్నారు. ఎంతోమంది చదువుకున్న ఆడవాళ్లు వంటింటికే పరిమితమయ్యారు.ఈ మధ్య కాలంలోనే మహిళ గడప దాటి అడుగు బయట పెడుతోంది. ఇలాంటప్పుడు ‘ఆమె’ వెన్నంటి నడిపించేందుకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అలా చేస్తేనే ఆమె మళ్లీ ఇంటిపనులకే పరిమితం కాకుండా ఉంటుంది. ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు తీసుకొస్తూ.. మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి.. ‘లోక్‌సభ, అసెంబ్లీలో కూడా మహిళలు ఉండాలి. చట్టాలు చేయడంలో వాళ్ల పాత్ర కచ్చితంగా అవసరం’ అని గుర్తించింది. అందుకే ‘నారీ శక్తి వందన్‌అభియాన్’ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు 27 ఏండ్ల భారతీయ మహిళల కోరిక. ఆ కోరిక బలమైనది కాబట్టే.. ఒకప్పుడు ఆడవాళ్లకు ఓటు వేయడానికి కూడా హక్కులేని దేశంలో ఇప్పుడు ప్రజలను పాలించే సభల్లో కూడా రిజర్వేషన్‌సాధించడంలో ఒక అడుగు ముందుకు వేసింది.
మన దేశంలో బలమైన మహిళా రాజకీయ ప్రముఖులు చాలా తక్కువ. కానీ.. ఇదివరకటితో పోలిస్తే రాజకీయాల్లో మహిళల సంఖ్య ఇప్పుడు కాస్త పెరిగింది. అయితే... ‘నారీ శక్తి వందన్’ బిల్లు అమల్లోకి వస్తే ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. పార్లమెంటుతోపాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది మోదీ గవర్నమెంట్.
దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో కొనసాగుతున్న ఫెమినిస్ట్ మూమెంట్, విమెన్ రైట్స్ యాక్టివిస్ట్స్, ఎంతోమంది మహిళా రాజకీయ నాయకుల కలలను సాకారం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అంటే.. మొత్తం సీట్లలో మహిళలకు మూడింట ఒక వంతు కేటాయిస్తారు. అయితే.. ఈ బిల్లు కొత్తదేం కాదు.. ఎప్పటినుంచో దీని గురించి చర్చ నడుస్తోంది. ఇదివరకు కూడా ప్రభుత్వాలు ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశాయి. కానీ.. కొన్నిసార్లు పురుషాధిపత్య పార్టీలు వ్యతిరేకించాయి. అయినా.. మోదీ వెనకడుగు వేయకుండా బిల్లును తీసుకొచ్చారు. అయితే.. మోదీ కంటే ముందే రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, హెచ్.డి. దేవెగౌడ, వాజ్‌పేయి లాంటి నాయకులు కూడా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడానికి చాలా కృషి చేశారు. అంతకంటే.. ముందు రాజ్యాంగ పరిషత్‌లో కూడా చర్చ జరిగింది.
స్వాతంత్ర్యానికి ముందే!
స్వాతంత్ర్యానికి ముందే ‘మహిళలకు రాజకీయాల్లో స్థానం కల్పించాలి. ఓటు హక్కు కల్పించాలి’ అనే లక్ష్యాలతో కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. 1917లో ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ (WIA), 1925లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా (NCWI), 1927లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ (AIWC) ఏర్పాటయ్యాయి. మహిళల కోసం ఉద్యమాలు చేశాయి. ఈ ఉద్యమాలకు ముఖ్య కారణం.. భారత ప్రభుత్వ చట్టం–1919లో మహిళలకు ఓటు హక్కును నిరాకరించడమే. ఈ విషయాన్ని సరోజినీ నాయుడు నేతృత్వంలోని భారతదేశ మహిళా డిప్యుటేషన్ అప్పటి భారత విదేశాంగ కార్యదర్శి ఎడ్విన్ శామ్యూల్ మాంటేగ్‌కు నివేదించింది. కొందరు మహిళా నాయకులు1928లో సైమన్ కమిషన్‌కు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ కూడా “మహిళలు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి చట్టసభల్లో నాలుగు సీట్ల రిజర్వేషన్లు కల్పించాల’’ని డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఉమెన్స్ ఇండియా అసోసియేషన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కలిసి మహిళలతో సహా వయోజన ఓటు హక్కుకు మద్దతు ఇచ్చే మెమోరాండంను రూపొందించాయి. దాన్ని 1931లో బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించాయి. కానీ.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనను వాళ్లు వ్యతిరేకించారు.
మేము బలహీనులం కాదు
మహిళలకు రిజర్వేషన్‌ను తిరస్కరిస్తూ.. అఖిల భారత మహిళా సదస్సులో సరోజినీ నాయుడు మాట్లాడుతూ “మేము బలహీనులం కాదు. పిరికి మహిళలం అంతకన్నా కాదు. ధైర్యసాహసాలు కలిగిన సావిత్రిని ఆదర్శంగా తీసుకుంటాం. సీత తన పవిత్రతను కాపాడుకుని.. అనుమానించిన వాళ్లను ఎలా ధిక్కరించిందో మాకు తెలుసు.
నేను ఈ లౌడ్-స్పీకర్‌లో చిన్నగా చెప్తున్నా.. నేను ఫెమినిస్ట్‌ని కాదు. ఫెమినిస్ట్‌గా ఉండటం అంటే ఒకరి జీవితం అణచివేయబడిందని అంగీకరించడమే. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ‘ఆమె’లోని న్యూనతా భావాన్ని అంగీకరించడమే” అన్నారు.
లెజిస్లేచర్లలో 2 శాతం
లార్డ్ లోథియన్ నేతృత్వంలోని ఇండియన్ ఫ్రాంచైజీ కమిటీ–1932 నివేదికలో మొదటి పదేళ్లపాటు ప్రావిన్షియల్ లెజిస్లేచర్లలో 2 శాతం నుండి 5 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని సిఫార్సు చేసింది. అలా మహిళల కోసం ప్రత్యేక సదుపాయం కల్పించకపోతే ఎక్కువ మంది మహిళా ఓటర్లు ఉన్నప్పటికీ కొంతమంది మహిళలే మొదటి శాసనసభకు ఎన్నిక అవుతారని చెప్పింది.
1935 చట్టం
ఆ తర్వాత వచ్చిన భారత ప్రభుత్వ చట్టం–1935 ప్రకారం 2.9 కోట్ల మంది పురుషులు, 60 లక్షల మంది మహిళలు ఓటు వేయడానికి అర్హులుగా గుర్తించారు. మతపరమైన ప్రాతిపదికన మహిళలకు సీట్లు కూడా రిజర్వ్ చేయబడ్డాయి. ఈ చట్టం ప్రకారమే.. మొదటిసారి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రాల చట్ట సభల్లో 41 సీట్లు, సెంట్రల్ లెజిస్లేచర్‌లో కొన్ని పరిమిత సీట్లను మతాల వారీగా మహిళలకు కేటాయించారు. కానీ.. ఇక్కడ కండిషన్ ఏంటంటే.. పెళ్లైన ఆడవాళ్లు మాత్రమే అర్హులు. మహిళలు ఏదైనా జనరల్ స్థానం నుండి కూడా పోటీ చేయవచ్చు. అయితే.. ఇది మహిళలపై గౌరవంతో ఇచ్చిన అవకాశం కాదు. విభజించు పాలించు సూత్రంలో భాగంగా స్వాతంత్ర్యోద్యమం నుంచి మహిళలను దూరం చేసేందుకు ఆంగ్లేయులు వేసిన ఎత్తుగడ.
రాజ్యాంగ సభలో...
భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలో కూడా మహిళా రిజర్వేషన్ విషయంపై చర్చ జరిగింది. అయితే, రిజర్వ్‌డ్ సీట్ల అవసరం లేకుండా ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కొందరు వాదించడంతో రిజర్వేషన్ అనవసరమని భావించారు. పైగా అందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నాం కాబట్టి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో చట్ట సభల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని రాజ్యాంగ నిర్మాణ సభ భావించింది.
‘మహిళలకు సమానత్వం కావాలి. రిజర్వేషన్లు కాదం’టూ పూర్ణిమా బెనర్జీ, సరోజిని నాయుడు, రేణుకా రే వాదించారు. మహిళలను పురుషులతో సమానంగా చూడాలని రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు రేణుకా రే అన్నారు. అందుకే 1935 చట్టం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను కూడా తొలగించారు. అంతేకాదు.. ప్రభుత్వంలో మహిళలకు రిజర్వేషన్‌ను కొన్ని మహిళా సంస్థలు కూడా తిరస్కరించాయి.
మొదటి లోక్‌సభ ఎన్నికల్లో
స్వాతంత్ర్యం వచ్చాక మొదటి లోక్‌సభ ఎన్నికలు 1952లో జరిగాయి. ఈ ఎన్నికల్లో 43 మంది మహిళలు మాత్రమే పోటీ చేశారు. వాళ్లలో 14 మంది మాత్రమే ఎన్నికయ్యారు. 489 స్థానాలకు 14 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 1952 మే 8న ముఖ్య మంత్రులకు రాసిన లేఖలో జవహర్‌లాల్ నెహ్రు కూడా తక్కువమంది మహిళలు ఎన్నికవడం గురించి ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ 1973లో
రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మొదటిసారి 1973లో మహిళా రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చింది. 1973లో జరిగిన అఖిల భారత పంచాయతీ పరిషత్ ఆరవ జాతీయ సదస్సుతో ఈ విషయం తెరపైకి వచ్చింది. పరిషత్ కనీసం మూడింట ఒక వంతు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ తీర్మానాన్ని అనుసరించి 1974లో దేశంలో కమిటీ ఆన్ ది స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా(సీఎస్‌డబ్ల్యూఐ) నివేదిక వచ్చింది. ఆ నివేదికలో రాష్ట్రాలు, కేంద్ర శాసన సభల్లో మహిళా రిజర్వేషన్ల డిమాండ్లను కమిటీ తిరస్కరించింది. కానీ.. చట్టబద్ధమైన మహిళా పంచాయతీలను సిఫార్సు చేసింది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలను నిర్లక్ష్యం చేయకూడదని నివేదికలో చెప్పింది. కమిటీలోని ఇద్దరు సభ్యులు మాత్రం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను సిఫారసు చేయకూడదనే నిర్ణయాన్ని విభేదించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి చట్టసభల్లో మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడం వల్ల మహిళల హక్కులు కాపాడినట్టు అవుతుందని వాళ్లకు అవకాశాలు కల్పించినవాళ్లం అవుతామని వాదించారు. అఖిల భారత పంచాయతీ పరిష సిఫార్సులను దాదాపు పదిహేనేళ్లకు పైగా విస్మరించారు. నేషనల్ పర్స్‌పెక్టివ్ ప్లాన్ 1988... కో–ఆప్షన్ ద్వారా పంచాయతీ, జిల్లా పరిషత్ స్థాయి, స్థానిక మున్సిపల్ బాడీల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది.
రెండేళ్లలో 50 శాతం
నేషనల్ కాన్ఫరెన్స్ (1989)లో రాజీవ్ గాంధీ తన ప్రసంగంలో పంచాయితీ రాజ్ సంస్థల్లో 30 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తామని మొదటిసారి ప్రకటించారు. అంతేకాదు.. మరో రెండేళ్లలో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. రాజీవ్ గాంధీ హయాంలోనే మొదటిసారి ఈ బిల్లు గురించి చర్చ జరిగింది. అందుకోసం రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని సవరించాలని సూచించారు. రూరల్, అర్బన్ ఎన్నికల వ్యవస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ బిల్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. అందుకోసం 64, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు (1989)పెట్టారు.
ఈ బిల్లు చర్చల సందర్భంగా పార్లమెంట్‌లో తీవ్రమైన వాదనలు వినిపించాయి. లోక్‌సభలో గట్టెక్కినా.. రాజ్యసభలో మాత్రం బిల్లుకు ఆమోద ముద్ర పడలేదు. రాజ్యసభలో ఆమోదించడానికి అవసరమైన మెజారిటీ రాలేదు. అయితే1991లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. దాంతో నాటి పీవీ నర్సింహ రావు ప్రభుత్వం.. 72, 73వ రాజ్యాంగ చట్ట సవరణల బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో కూడా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33శాతానికి తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలని ప్రతిపాదించారు. తెలంగాణకు చెందిన నేతలు పీవీ నర్సింహారావు ప్రధానిగా, జీ వెంకటస్వామి గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేశారు. ఈ బిల్లు 1992 డిసెంబర్‌లో ఆమోదించారు. 1993 ఏప్రిల్ నాటికి అన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. అందుకే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, నగరపాలికల్లో లక్షల మంది మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. చాలా మంది ఎక్స్‌పర్ట్స్ మహిళల విషయంలో 73వ రాజ్యాంగ సవరణ ఒక మైలురాయి అని చెప్తుంటారు. ఎందుకంటే.. ఆ చట్టం వల్లే దేశంలో మహిళలకు రాజకీయ గుర్తింపు దక్కింది. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు మహిళల రిజర్వేషన్‌లో మార్పులు చేసుకునే అవకాశం కూడా దక్కింది. అందువల్ల తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్ అమలు అవుతోంది. అప్పట్లో ఐక్యరాజ్య సమితి ఉమెన్ రీజినల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అన్నే ఎఫ్ స్టెన్‌హమ్మర్ (దక్షిణాసియా) కూడా ఈ చట్టం గురించి మాట్లాడుతూ ‘‘భారతదేశంలో స్థానిక స్థాయిలో 15 లక్షల మంది మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు” అన్నారు.
దేవెగౌడ తీసుకొచ్చిన బిల్లు
మహిళా సంఘాల డిమాండ్ వల్ల హెచ్.డి. దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం(13 పార్టీల కూటమి) పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకురావాలని అభిప్రాయపడింది. అందుకోసం అప్పటి న్యాయ శాఖ సహాయ మంత్రి రమాకాంత్ డి ఖలప్ సెప్టెంబర్ 12, 1996న మొదటిసారి లోక్‌సభలో రాజ్యాంగ 81వ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. కొత్త ఆర్టికల్స్ 330A, 332A చేర్చాలి అనుకున్నారు. అయితే.. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత జనతాదళ్‌లోని కొందరు నాయకులు, అధికార సంకీర్ణంలోని మరికొందరు దీనిని వ్యతిరేకించారు.
కమిటీ నివేదిక
మరుసటి రోజు సీపీఐకి చెందిన గీతా ముఖర్జీ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లు పంపారు. అప్పటి ఎంపీలు మమతా బెనర్జీ , మీరా కుమార్, సుమిత్రా మహాజన్, నితీష్ కుమార్, శరద్ పవార్, విజయ్ భాస్కర రెడ్డి, సుష్మా స్వరాజ్, ఉమాభారతి, గిరిజా వ్యాస్, రామ్ గోపాల్ యాదవ్, సుషీల్ కుమార్ షిండే, హన్నన్ మొల్లా(అప్పటి ఎంపీలు).. 31 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ ప్యానెల్ ఏడు ముఖ్యమైన సూచనలు చేసింది. ముఖ్యంగా మహిళల రిజర్వేషన్‌కు సంబంధించి ‘‘మూడింట ఒక వంతు కంటే తక్కువ కాకుండా”(not less than one third) అనే పదాలు అస్పష్టంగా ఉన్నాయని.. మరో రకంగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని చెప్పారు. అస్పష్టత లేకుండా ఉండాలంటే.. ‘‘దాదాపుగా మూడింట ఒక వంతు’’(as nearly as may be, one-third) అని రాయాలని సూచించారు. రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో కూడా మహిళలకు సీట్ల రిజర్వేషన్లు ఉండాలని సూచించారు. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్ల ప్రయోజనాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు.. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు సీట్ల రిజర్వేషన్.. చట్టం మొదలైన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు ఉండాలని, ఆ తర్వాత చట్టాన్ని సమీక్షించి రిజర్వేషన్‌లను నిర్ణయించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుండి నామినేట్ చేయబడిన సభ్యుల్లో కూడా ఒక మహిళ ఉండాలని చెప్పింది. ఈ ప్యానెల్ షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీలు)కు మూడు సీట్ల కంటే తక్కువ రిజర్వేషన్లు ఉన్న రాష్ట్రాల గురించి కూడా ప్యానెల్ మాట్లాడింది. అలాంటప్పుడు కమిటీ రొటేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. మొదటి టర్మ్‌లో ఒక సీటు మహిళలకు రిజర్వ్ చేస్తే.. రెండో టర్మ్‌లో మరో సీటు రిజర్వ్ చేయాలని, మూడవ టర్మ్‌లో సీట్లు అన్‌రిజర్వ్ చేయాలని ప్యానెల్ చెప్పింది. ఢిల్లీ అసెంబ్లీని కూడా బిల్లు పరిధిలోకి తీసుకురావాలన్నది మరో సూచన. కమిటీ తన నివేదికను డిసెంబర్ 1996లో ఆమోదించింది. ఈ నివేదిక మీద కూడా వ్యతిరేక స్వరాలు వినిపించాయి.
ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఓబీసీ మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడారు. తన అసమ్మతి నోట్‌లో “ఈ బిల్లు ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తుంది. ఓబీసీ మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పించాలనేది నా అభిప్రాయం. అందువల్ల మూడింట ఒక వంతు రిజర్వేషన్‌లో జనాభా నిష్పత్తిలో ఓబీసీ మహిళలను చేర్చాలని కోరుకుంటున్నా” అని రాశారు. డి.ఎం.కె.కు చెందిన పి.ఎ.న్ శివ కూడా ఈ బిల్లుని ఒప్పుకోలేదు. చర్చలో దివంగత సోషలిస్ట్ ఎంపీ శరద్ యాదవ్ “కౌన్ మహిళా హై? కౌన్ నహీ హై? కేవల్ బాల్ కాటీ మహిళా భర్ నహీ రహ్నే దేంగే’’ అన్నారు. ఇలా.. అనేక చర్చల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం బిల్లును తీసుకరాలేకపోయింది.
రెండో ప్రయత్నం
దేవెగౌడ తర్వాత 1998, 2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బిల్లును తీసుకురావడానికి మళ్లీ ప్రయత్నించింది. తొలిసారి 1998 జులై 13న అప్పటి న్యాయ శాఖ మంత్రి ఎం. తంబి దురై లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. దాంతో సభ గందరగోళంగా మారింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీలు నిరసన తెలిపారు. గందరగోళం మధ్య ఆర్జేడీ ఎంపీ సురేంద్ర ప్రసాద్ యాదవ్ - స్పీకర్ జీఎంసీ బాలయోగి నుండి బిల్లు కాపీలను లాక్కొని చించేశారు. ఇప్పుడు బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేంద్ర ఈ మధ్య మాట్లాడుతూ ‘‘బీఆర్ అంబేద్కర్ తన కలలో కనిపించి అలా చేయమని కోరినందున” బిల్లు కాపీని చించివేసినట్లు చెప్పారు.
మరుసటి రోజు కూడా బిల్లు ప్రవేశపెట్టడానికి లిస్ట్ చేశారు. అయితే.. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో స్పీకర్ బిల్లు ప్రవేశ పెట్టడాన్ని వాయిదా వేశారు. అదే సంవత్సరంలో మళ్లీ ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది. 1998 డిసెంబరు11న స్పీకర్ పోడియం వైపు వెళ్లకుండా ఎస్పీ ఎంపీ దరోగ ప్రసాద్ సరోజ్‌ను అడ్డుకునేందుకు బెనర్జీ ప్రయత్నించినప్పుడు లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ మోర్చా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), ముస్లిం లీగ్ సభ్యులు నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ చివరకు 1998 డిసెంబర్ 23న బిల్లు ప్రవేశపెట్టారు. అయితే.. దీనిపై ఎన్డీయే మిత్రపక్షాల మధ్య కూడా విభేదాలు వచ్చాయి. బిల్లును వ్యతిరేకించిన నితీశ్ అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్నారు. అయితే.. 1999 ఏప్రిల్‌లో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయిన తర్వాత సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దయింది.
మరోసారి
వాజ్‌పేయి మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1999 డిసెంబర్ 23న అప్పటి న్యాయ మంత్రి రామ్ జెఠ్మలానీ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో మళ్లీ ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ సభ్యుల నిరసనలు వెల్లువెత్తాయి. వాజ్‌పేయి ప్రభుత్వం 2000, 2002, 2003లో మూడుసార్లు బిల్లును సభ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించింది. కానీ.. సక్సెస్ కాలేకపోయింది. జులై 2003లో అప్పటి స్పీకర్ మనోహర్ జోషి ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ.. విఫలమయ్యారు.
యూపీఏ హయాంలో...
2004 మేలో యూపీఏ అధికారంలోకి వచ్చింది. పీఎం మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం విధానసభలు, లోక్ సభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కోసం చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. అప్పట్లో ఆర్జేడీ యూపీఏలో కీలకమైన పార్టీ. దాని అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన బిల్లుకు అనుకూలంగా లేకపోవడంతో యూపీఏ తన ఆలోచనను వెనక్కి తీసుకుంది. చివరకు 2008 మే 6న యూపీఏ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. కానీ.. అంతకుముందు జరిగినట్టుగానే అనేక వాదనలు వినిపించాయి. న్యాయ శాఖ మంత్రి హెచ్.ఆర్. భరద్వాజ్ మాట్లాడకముందే.. ఎస్పీ ఎంపీ అబు అజ్మీ బిల్లు కాపీని లాక్కోవడానికి అతని వైపు పరుగెత్తారు. అప్పటి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి, మరికొందరు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆయనను అడ్డుకున్నారు. మరో ఎస్పీ ఎంపీ చిరిగిన కాగితాలను విసిరారు. కాంగ్రెస్ ఎంపీలు తన చుట్టూ సెక్యూరిటీ రింగ్‌ని ఏర్పాటు చేయడంతో భరద్వాజ్ చివరకు బిల్లును ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని ఈఎం సుదర్శన నాచ్చియప్పన్ నేతృత్వంలోని పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించారు.
కమిటీ డిసెంబరు 2009లో తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. లోక్‌సభ, శాసనసభల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని, లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన సీట్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు కేటాయించాలని బిల్లులో ప్రతిపాదించింది. ఎలాంటి జాప్యం లేకుండా బిల్లును ప్రస్తుత రూపంలోనే ఆమోదించాలని సిఫార్సు చేసింది. 31 మంది సభ్యుల ప్యానెల్‌లో ఇద్దరు ఎస్పీ నేతలు వీరేంద్ర భాటియా, శైలేంద్ర కుమార్ తమ అసమ్మతిని తెలిపారు.
2010లో ...
కొన్నేండ్లపాటు పెండింగ్‌లో ఉన్న తర్వాత 2010లో బిల్లు కొంత పురోగతిని సాధించింది. యూపీఏ ప్రభుత్వం నుంచి ఆర్జేడీ నుంచి తప్పుకుంది. ఎస్పీ యూపీఏలో భాగం కాకపోయినా ప్రభుత్వానికి బయటి నుంచి సపోర్ట్ చేసింది. రెండు రోజుల చర్చల తర్వాత 2010 మార్చి 9న రాజ్యసభ మూడింట రెండు వంతుల మెజారిటీతో బిల్లుని ఆమోదించింది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, వామపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి. శరద్ జోషి ఒకరు మాత్రమే వ్యతిరేకించారు. అయితే.. అంతకుముందు రోజు రాజ్యసభలో గందర గోళం నెలకొంది. ఎస్పీకి చెందిన నంద్ కిషోర్ యాదవ్, కమల్ అక్తర్ అప్పటి ఛైర్మన్ హమీద్ అన్సారీ టేబుల్ పైకి ఎక్కారు. రాజ్‌నీతి ప్రసాద్ బిల్లు కాపీని చించి ఛైర్మన్‌పైకి విసిరారు. తర్వాత 2014లో లోక్‌సభ రద్దు అయ్యింది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు లోక్‌సభలో ఈ బిల్లు గురించి ప్రస్తావించలేదు. కానీ.. ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టింది.
ప్రవేశపెట్టిన ప్రతిసారి
పార్లమెంట్‌లో బిల్లుని ప్రవేశపెట్టిన ప్రతిసారి మెజారిటీ ఎంపీలు సపోర్ట్ చేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఎంపీలు ప్రతిసారి బిల్లుని వ్యతిరేకించకుండా బిల్లులోని కొన్ని నిబంధనలను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. 1996 నుంచి ఇప్పుడు మోదీ బిల్లు ప్రవేశపెట్టే వరకు అదే జరిగింది. ఒక కులానికి ఇచ్చే రిజ ర్వేషన్లతో ఈ మహిళా రిజర్వేషన్లను పోల్చకూడదని కొందరు అంటున్నారు. మరికొందరు రాజ్యాంగంలో ఉన్న సమానత్వ భావాలకు గండిపడుతుందని ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్ వస్తే.. మెరిట్ ఆధారంగా వచ్చే స్థానాలు పోతాయని అంటున్నారు. రాజ్యసభలో ఉన్న ఎన్నికల ప్రక్రియ కూడా ఈ రిజర్వేషన్‌కు సహకరించదని చెప్తున్నారు. బిల్లు ఆమోదాన్ని బహిరంగంగా ప్రతిఘటించిన పార్టీలకే కాకుండా బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకు చెందిన అనేక మంది పురుష ఎంపీలు కూడా బిల్లుకు ఆమోద ముద్ర పడకూడదనే కోరుకుంటున్నారు.
బిల్లులో ఏముంది?
- ఈ బిల్లు ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% సీట్లను కేటాయిస్తారు. దీన్ని కొత్త పార్లమెంట్ భవనంలో 128వ రాజ్యాంగ సవరణ బిల్లుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. లోక్‌సభ సభ్యుల్లో 454 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు మాత్రమే బిల్లుని వ్యతిరేకించారు.
- లోక్‌సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఈ బిల్లులో ఉంది. అంటే.. 543 లోక్‌సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)ల కోసం రిజర్వ్ చేసిన సీట్లు ఉన్నాయి. వాటి స్థానాల్లో ఇప్పుడు మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీల కోసం 131 రిజర్వ్‌డ్ సీట్లు ఉన్నాయి. వీటి నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో భాగంగానే లెక్కిస్తారు. అంటే.. మహిళలకు రిజర్వ్ అయ్యే 181 స్థానాల్లో, 138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు ఇస్తారు. ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్‌సభలో అందుబాటులో ఉన్న సీట్లను బట్టి అంచనా వేసినవే. డీలిమిటేషన్ కసరత్తు మొదలైతే ఇవి మారే అవకాశాలు ఉన్నాయి.
ఎప్పటినుంచి అమల్లోకి
- ఈ బిల్లు ప్రారంభమైన తర్వాత చేసిన మొదటి జనాభా గణన తర్వాత రిజర్వేషన్ అమలులోకి వస్తుంది. జనాభా లెక్కల ఆధారంగా మహిళలకు సీట్లు కేటాయించేందుకు డీలిమిటేషన్ చేపట్టనున్నారు. ఈ రిజర్వేషన్లు 15 ఏండ్ల పాటు కల్పిస్తారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మహిళల కోసం రిజర్వు చేయబడిన సీట్లు ప్రతి డీలిమిటేషన్ తర్వాత పార్లమెంటు చేసిన చట్టం ద్వారా నిర్ణయిస్తారు.
- డీలిమిటేషన్ అంటే.. జనాభా ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. దేశవ్యాప్త డీలిమిటేషన్ ప్రక్రియ చివరిసారిగా 2002లో జరిగింది. ఇది 2009లో అమల్లోకి వచ్చింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. ప్రాక్టికల్‌గా చూస్తే, ఈ రిజర్వేషన్ల అమలు 2029 సార్వత్రిక ఎన్నికల వరకు సాధ్యం కాదు.
- రిజర్వ్‌డ్ సీట్లను ఎలా నిర్ణయిస్తారు?
- ప్రతి డీలిమిటేషన్ తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను రొటేట్ చేస్తామని బిల్లులో చెప్పారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వానికి ఈ రాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది. అయితే సీట్ల రొటేషన్, డీలిమిటేషన్ చేపట్టడానికి ఒక ప్రత్యేక చట్టం, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
చిన్న రాష్ట్రాల్లో...
లడఖ్, చండీగఢ్ లాంటి ఒక ఎంపీ సీటు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందో ఇంకా నిర్ణయించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, త్రిపురల్లో రెండు చొప్పున, నాగాలాండ్‌లో ఒకే ఎంపీ స్థానం ఉంటుంది. అయితే, మునుపటి మహిళా రిజర్వేషన్ బిల్లులో ఈ అంశానికి ఒక పరిష్కారం చూపారు. ఒకే సీటు ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో... ఒక లోక్‌సభ ఎన్నికల్లో ఆ సీటును మహిళలకు కేటాయించి, తర్వాతి రెండు ఎన్నికలకు దాన్ని రిజర్వ్ చేయకూడదని 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో పేర్కొన్నారు. రెండు సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఒక సీటును రెండు లోక్‌సభ ఎన్నికల వరకు రిజర్వ్ చేసి, మూడో ఎన్నికలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్ కేటాయించకూడదని నిర్ణయించారు.
ఇతర దేశాల్లో మహిళల కోటా ఎంత?
- పార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే భారతదేశానిది పేలవమైన రికార్డు. ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) డాటా ప్రకారం, లోక్ సభలో మహిళల శాతం పరంగా185 దేశాలలో భారతదేశం స్థానం 141.
- ప్రస్తుతం, భారతదేశం 545 మంది సభ్యులున్న లోక్ సభలో 78 మంది మహిళా ఎంపీలను కలిగి ఉంది. ఇది సభ మొత్తం సభ్యత్వంలో14 శాతం. భారతదేశంలోని మెజారిటీ రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళా శాసనసభ్యులు15 శాతం కంటే తక్కువ ఉన్నారు.
- ఐపియు డాటా ప్రకారం, రువాండాలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మహిళా చట్టసభ్యులు ఉన్నారు. అక్కడ లోక్ సభలో 80 సీట్లు ఉంటే అందులో 49 మంది మహిళలే. అంటే దాదాపు 61 శాతం అన్నమాట.
- లోక్ సభలో 46.2 శాతం మహిళల ప్రాతినిధ్యంఉన్న దక్షిణాఫ్రికా మహిళా శాసనసభ్యుల శాతంలో యుఎస్, యుకె, ఆస్ట్రేలియా, జర్మనీ, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందు ఉంది.
మహిళా కోటా ఉన్న దేశాలు ఇవి...
- భారతదేశ రాజ్యాంగంలోని 73, 74వ సవరణల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలి. అలాగే పంచాయతీ రాజ్ సంస్థల్లోని అన్ని స్థాయిల్లోని చైర్‌పర్సన్ కార్యాలయాల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి. వాటిలో పట్టణ స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి.
పాకిస్తాన్
- 2002 తర్వాత, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 357 సీట్లలో 60 సీట్లను మహిళలకు కేటాయించింది. అంటే దాదాపు17 శాతం. అయితే, అంతకు ముందు కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కాకపోతే1956 నాటి పాకిస్తాన్ రాజ్యాంగం అప్పటి ఏకసభ్య పార్లమెంట్‌లో పది స్థానాలను మహిళలకు కేటాయించింది.
- పాకిస్తాన్ రాజ్యాంగం1962 ప్రకారం, తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ నుండి మూడు సీట్లు సహా నేషనల్ అసెంబ్లీలో ఆరు సీట్లు మహిళలకు రిజర్వ్ చేశారు.
- 1973 నాటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు లేదా మూడవ సార్వత్రిక ఎన్నికల రోజు నుండి పదేళ్లపాటు మహిళలకు పది స్థానాలను రిజర్వ్ చేసింది.
- 1985లో, పాకిస్తాన్ మహిళలకు రిజర్వేషన్ సీట్ల సంఖ్యను 10 నుంచి 20కి పెంచింది. 2002లో పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని 60కి పెంచింది.
- అయితే కోటాల కారణంగా రాజకీయ పార్టీలు అధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చినప్పటికీ, వాళ్లు ఎక్కువగా రిజర్వ్‌డ్ సీట్లకే పరిమితం అయ్యారు. ఐపియు డాటా ప్రకారం లోక్ సభలోని 342 సీట్లలో 70 సీట్లు లేదా 20 శాతం మహిళా శాస నసభ్యులు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే 20 శాతం కం టే ఎక్కువ లేదా 342 సీట్లలో 70 సీట్లు మహిళలు పాకిస్తాన్ అసెంబ్లీలో ఉన్నారు.
ఫిలిప్పీన్స్‌లో...
ఫిలిప్పీన్స్ లో 40 శాతం మహిళా కోటా ఉంది. ఫిలిప్పీన్ మహిళా కమిషన్ ప్రకారం ఆ దేశ పార్లమెంట్‌లో 28 శాతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ. లోక్ సభలోని 311 సీట్లలో ప్రస్తుతం 85 మంది మహిళా సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న ఆగ్నేయాసియా దేశాలలో ఫిలిప్పీన్స్ ఒకటి. ఇక్కడ ప్రాంతీయ రాజకీయాల్లో మహిళల సంఖ్య ఎక్కువ.
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లోని ఏకైక శాసనసభలో 350 సీట్లలో 50 మహిళలకు రిజర్వు అయ్యాయి. బంగ్లాదేశ్‌లోని అత్యున్నత శాసన సభ అయిన జతియా సంగ్‌సద్‌లో ప్రస్తుతం 20 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉంది, అంటే 73 స్థానాల్లో మహిళా శాసనసభ్యులు ఉన్నారు. బంగ్లాదేశ్ మొదటిసారిగా 1972లో పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. 10 సంవత్సరాలకు15 సీట్లను రిజర్వ్ చేసింది. 1979లో తరువాతి 15 సంవత్సరాలకు రిజర్వ్‌డ్ స్థానాలను 30కి పెంచడంతో మొత్తం పార్లమెంటు స్థానాల సంఖ్య 330కి చేరింది. 2011లో రాజ్యాంగంలోని 15వ సవరణ ద్వారా బంగ్లాదేశ్‌లో మహిళలకు 50 సీట్లు కేటాయించారు. అలా జాతీయ పార్లమెంట్‌లో మొత్తం సీట్ల సంఖ్య 350కి చేరుకుంది.
ఇతర దేశాలు
1990ల ప్రారంభంలో నేపాల్, అర్జెంటీనా రాజకీయ పార్టీలు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మహిళలకు కనీస కోటా నిర్ణయించాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అభ్యర్థుల జాబితాలో 50 శాతం వరకు మహిళల కోటాను ఫ్రాన్స్, దక్షిణ కొరియా, నేపాల్ ఆమోదించాయి. అర్జెంటీనా, మెక్సికో, కోస్టారికా వంటి దేశాలు పార్టీ కోటాలను చట్టబద్ధం చేశాయి. అక్కడ జాతీయ చట్ట సభల్లో 36 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యం ఉంది. దక్షిణాఫ్రికా, స్వీడన్, జర్మనీ రాజకీయ పార్టీలు ఆమోదించిన స్వచ్ఛంద కోటాల ద్వారా మహిళా ప్రాతినిధ్యం అధికంగా పెరిగింది. ఎరిట్రియా, టాంజానియా వంటి ఇతర ఆఫ్రికన్ దేశాలు కూడా రాజకీయాల్లో మహిళల కోటాకు ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు పెట్టుకున్నాయి.
ఎంతమంది మహిళలు?
ఈ బిల్లుని ఆమోదిస్తే.. లోక్‌సభతో పాటు అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, సిక్కిం, తమిళ్నాడు, తెలంగాణ, త్రిపుర, పుదుచ్చేరి అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యం 10శాతం కన్నా తక్కువగానే ఉంది. బిహార్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలో 10–12శాతం ఉంది. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్‌లో 14.47శాతం, 13.7శాతం, 12.5శాతంగా ఉన్నాయి. లోక్‌సభలోని 543మంది సభ్యుల్లో మహిళలు 15శాతం మాత్రమే ఉన్నారు. రాజ్యసభ విషయానికొస్తే.. 14శాతం మాత్రమే ఉన్నారు.
మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ
తాము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిపెస్టోలో ప్రకటించింది. కానీ.. 2014లో ప్రభుత్వం ఏర్పడి ఇన్నేండ్లు గడిచినా బిల్లు ప్రవేశపెట్టలేదు. కానీ.. ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది. సోనియా గాంధీ 2017లో ప్రధానికి లేఖ రాస్తూ ఈ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత కూడా 2018 జూలై 16న ప్రధానమంత్రికి రాసిన లేఖలో తమ పార్టీ మద్దతు తెలిపారు.