కరీంనగర్ లోని ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం

కరీంనగర్ లోని ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం
  • సేతు బంధన్ స్కీమ్ కింద రూ.154 కోట్లు మంజూరు 
  • కొత్త ప్రపోజల్స్ లో చేర్పించిన ఎంపీ బండి సంజయ్ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఎల్ సీ నంబర్ 18 వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ.154 కోట్లతో పంపిన ప్రపోజల్స్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాస్తవానికి గతంలోనే తీగలగుట్టపల్లి ప్రాంతంలో రూ.100 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటా భాగస్వామ్యంతో చేపట్టడానికి కేంద్రం అన్ని అనుమతులను మంజూరు చేసింది. సెంట్రల్​గవర్నమెంట్​తన వాటా నిధులను పోయిన ఏడాది మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను రిలీజ్ చేయకపోవడంతో ఆర్ఓబీ నిర్మాణంపై  నీలినీడలు అలుముకున్నాయి.

దీంతో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీగలగుట్టపల్లి ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆర్వోబీ నిర్మాణానికి సేతు బంధన్ స్కీమ్ కింద పూర్తి స్థాయిలో ఫండ్స్ ఇచ్చేందుకు అప్రూవల్ ఇచ్చింది. తీగలగుట్టపల్లి ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణమైతే నిత్యం ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహనదారులు, ప్రజలు, ముఖ్యంగా హాస్పిటళ్లకు వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పనున్నాయి.