ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో చాలామందిలో చాలారకాలుగా ఆందోళనలు నెలకొన్నాయి. ఉద్యోగాలు పోతాయనే భయాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం చాట్‌జీపీటీ తరహా ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్‌పైనా అదే తరహా ఆందోళనలు ఉన్నాయి. వీటివల్ల ఉద్యోగాలు పోతాయని కొందరు భయపడుతుండగా.. అలాంటి భయాలేవీ అక్కర్లేదని మరికొందరు చెబుతున్నారు. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వాదించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి చర్చలు జరుగుతున్న సమయంలోనే చాట్‌జీపీటీ రూపకర్త, చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ (openAI) సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల ఉద్యోగాలు మాయం అవుతాయని చెప్పారు. ఇదే విషయమై ఆయన ఈ మధ్య పలు ఇంటర్వ్యూల్లో వివరించారు.
గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ విశేష ఆదరణ పొందిందని ఆల్ట్‌మన్ తెలిపారు. అయితే.. ఏఐ టూల్స్ అన్నీ పరిపూర్ణం కావని, వాటికీ కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. ఏఐ సంస్థకు సీఈఓ అయిన ఆయన.. స్వయంగా ఏఐ పట్ల ఆందోళన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మానవాళిపై ఏఐ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉండకపోవచ్చని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు.
ఏఐ కేవలం మనిషికి అనుబంధంగా పని చేస్తుందని, ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయదంటూ చేస్తున్న వాదనలను ఆల్ట్‌మన్ తోసిపుచ్చారు. ఉద్యోగాలు ‘కచ్చితంగా’ ప్రభావితమవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న చాట్‌జీపీటీ కన్నా పవర్‌ఫుల్ ఏఐని డెవలప్ చేయగల సత్తా ఓపెన్‌ఏఐకి ఉన్నా.. ఇప్పటికిప్పుడే విడుదల చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు.
ఏఐ అభివృద్ధి సమాజంలో మనిషికి సవాల్‌గా మారకూడదని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. మనిషి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటూ ఉద్యోగాలకు అంతరాయం ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ, నియంత్రణ అవసరం ఉందని చెప్పారు.