PSL 2025: ఐపీఎల్‌కు మించిన టోర్నీ లేదు.. పాకిస్థాన్ జర్నలిస్ట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ దిమ్మ తిరిగే కౌంటర్

PSL 2025: ఐపీఎల్‌కు మించిన టోర్నీ లేదు.. పాకిస్థాన్ జర్నలిస్ట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ దిమ్మ తిరిగే కౌంటర్

ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ కు మించిన టీ20 టోర్నీ లేదనేది వాస్తవం. సగటు క్రికెట్ అభిమానిని ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. ప్రపంచ క్రికెటర్లందరూ ఈ మెగా టోర్నీ ఆడడానికి తెగ ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్ కు ఎంపికైన వారు చాలా మందే ఉన్నారు. రెండు నెలల పాటు అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చే ఐపీఎల్ ప్రపంచంలోనే నెంబర్ వన్ టీ20 టోర్నీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఐసీసీ నిర్వహించే టీ20 వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ కే ఎక్కువ ఆదరణ ఉంటుంది. 

అయితే పాకిస్థాన్ క్రికెట్ తో పాటు అక్కడ ఫ్యాన్స్ తమ దేశంలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐపీఎల్ కు ఏ మాత్రం తీసిపోదని వితండ వాదన చేస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ తో సమాంతరంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతుంది. శుక్రవారం (ఏప్రిల్ 11) ప్రారంభయిన ఈ లీగ్ విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఇదిలా ఉంటే.. ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా.. లాహోర్ ఖలందర్స్ ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ ను ఇండియన్  ప్రీమియర్ లీగ్‌ని పాకిస్థాన్ సూపర్ లీగ్ తో పోల్చమని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్‌ అడిగాడు. దీనికి స్పందించిన బిల్లింగ్స్.. ఐపీఎల్ ను హైలెట్ చేసి మాట్లాడి అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. 

బిల్లింగ్స్ మాట్లాడుతూ.. " ప్రపంచవ్యాప్తంగా అత్యంత హైప్  ఉన్న టీ20 లీగ్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఒకటి. కానీ ఐపీఎల్ ఆదరణ, గ్లామర్ తో పోలిస్తే ఏ టీ20 టోర్నీ కూడా సరిపోదు. కేవలం పిఎస్ఎల్ మాత్రమే కాదు ప్రపంచంలో ఏ టీ20 టోర్నమెంట్ కూడా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా చేరలేదు. మీరు నా నుంచి ఏదో వివాదాస్పద సమాధానం చెప్పించాలనుకుంటున్నారు. పూర్తిగా క్లారిటీతో చెబుతున్నాను. ప్రపంచంలో  ఐపీఎల్ ను వదిలేసి మిగతా లీగ్ లను చూడడం చాలా కష్టం. పాకిస్థాన్ సూపర్ లీగ్ లాగా.. ఇంగ్లాండ్ లో మేము.. అదే విధంగా ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఐపీఎల్ తర్వాత రెండో బెస్ట్ లీగ్ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి". అని ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ తెలిపాడు.