హండ్రెడ్ లీగ్ టోర్నీలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ బ్యాట్ ఝళిపించడంలో విఫలమయ్యాడు. దీంతో తనకు తానుగా రిటైర్ అవుతున్నట్టు నిర్ణయించుకున్నాడు. ఆదివారం (ఆగస్ట్ 4) లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్- ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో 17 బంతుల్లో బిల్లింగ్స్ 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతను ఒక సిక్సర్ మాత్రమే కొట్టగలిగాడు.
ఓవల్ ఇన్విన్సిబుల్స్ స్కోర్ 41 పరుగులకు 2 వికెట్లు కొల్పోయినప్పుడు నాలుగో స్థానంలో బిల్లింగ్స్ బ్యాటింగ్ కు వచ్చాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బందిపడిన బిల్లింగ్స్ వేగంగా ఆడలేకపోయాడు. మరోవైపు సామ్ కరణ్, డేవిడ్ మలన్ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ దశలో జట్టు కోసం ఆలోచించి ఇన్నింగ్స్ 87 వ బంతికి తప్పుకున్నాడు. దీంతో డోనోవన్ ఫెరీరా అతని స్థానంలో వచ్చి ఇన్నింగ్స్ కొనసాగించాడు. బిల్లింగ్స్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే లండన్ స్పిరిట్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో సామ్ కరణ్ ఆల్ రౌండ్ షో తో అదరగొట్టడంతో ఓవల్ ఇన్విన్సిబుల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటిగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సామ్ కరణ్ 22 బంతుల్లోనే 6 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో లండన్ స్పిరిట్ 117 పరుగులకే ఆలౌటైంది. సామ్ కరణ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.