T20 Blast: 27 పరుగులకే 3 వికెట్లు.. వీరోచిత సెంచరీతో గెలిపించిన సామ్ కరణ్

T20 Blast: 27 పరుగులకే 3 వికెట్లు.. వీరోచిత సెంచరీతో గెలిపించిన సామ్ కరణ్

ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లో ఆల్ రౌండర్ సామ్ కరణ్ టాప్ ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు. ఆల్ రౌండర్ గా క్రికెట్ లో అదరగొడుతున్న కరణ్.. సెంచరీ చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం విశేషం. గత కొంత కాలంగా బ్యాటింగ్ లో ఎంతో పరిణితి చూపిస్తున్న ఈ ఇంగ్లాండ్ ఆటగాడు.. స్పెషలిస్ట్ బ్యాటర్ వలె ఆడాడు. సర్రే తరపున ఆడుతున్న కరణ్.. హాంప్‌షైర్‌ పై 58 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

కరణ్ సూపర్ ఆట తీరుతో సర్రే 184 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఒకదశలో సర్రే 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. విల్ జాక్స్(6), ఇవాన్స్(8), బర్న్స్(7) విఫలమయ్యారు. ఈ దశలో ఓపెనర్ సిబిలీ (27)తో కరణ్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బౌండరీల మోత మోగిస్తూ జట్టును విజయ తీరాల వైపుకు నడిపించాడు. సిబిలీ ఔటైనా ఓవర్దన్ (21) తో కలిసి విజయాన్ని పూర్తి చేశాడు. పంజాబ్ పై రూ. 18.5 కోట్ల రూపాయలకు సామ్ కరణ్ ను కొన్న సంగతి తెలిసిందే. 

కరణ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ తన ఐపీఎల్ కెరీర్ కు ఉపయోగపడొచ్చు. ఇదే ఫామ్ కొనసాగిస్తే 2025 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ అతన్ని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్‌ 19.5 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. 184 పరుగుల లక్ష్యాన్ని సర్రే 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి గెలిచింది.