కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ నేతలది ద్వంద్వ నీతి : సామ రామ్మోహన్ రెడ్డి

కంచ గచ్చిబౌలి భూములపై  బీఆర్ఎస్ నేతలది ద్వంద్వ నీతి : సామ రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ నేతలు ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నారని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. సెంట్రల్ ఎంపవర్డు కమిటీకి సమర్పించిన వినతి పత్రంలో కంచగచ్చిబౌలి భూములను డీమ్డ్ ఫారెస్ట్ గా ప్రస్తావించడమే దీనికి నిదర్శనమన్నారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 400 ఎకరాల  కంచగచ్చిబౌలి భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్  నేతలు సెంట్రల్ ఎంపవర్డు కమిటీకిచ్చిన వినతి పత్రంలో పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 

కానీ ఆ భూముల్ని  డీమ్డ్ ఫారెస్ట్ అని ప్రస్తావించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇదే నిజమైతే, మరి బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ భూమిని అటవీ భూమిగా అని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పైగా అదే భూమి పక్కన ఉన్న లగ్జరీ అపార్ట్ మెంట్లకు పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2015~16 లో హెచ్‌‌‌‌‌‌‌‌సీయూలో సీఎం హోదాలో కేసీఆర్ చెట్లను నరికించి, వేరే మొక్కలు నాటారని గుర్తుచేశారు.  అది డీమ్డ్ పారెస్టు అయితే చెట్లను ఎలా నరికేశారని నిలదీశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని హరీశ్​రావుకు సామ రామ్మోహన్ రెడ్డి  సవాల్ విసిరారు.