కులగణన సర్వే డాటా ఎంట్రీ షురూ

కులగణన సర్వే డాటా ఎంట్రీ షురూ
  • అర్బన్​లో మొదలు, ఇయాల్టి నుంచి మండలాల్లో​ 
  • కీ రోల్​ ఎన్యుమరేటర్లదే 
  • ప్రజాపాలన ఎంట్రీ లోపాలు రిపీట్​ కాకుండా చర్యలు 
  • ఈనెలాఖరు కంప్లీట్​ చేసే టార్గెట్

నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆన్​లైన్​నమోదు ప్రక్రియ షురువైంది.  జిల్లాలోని అర్బన్​ ఏరియాలో గురువారం సాయంత్రం నుంచి ప్రారంభంకాగా మండలాల వారీగా శుక్రవారం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. సుమారు 1500 కంప్యూటర్లు, 750 మంది ఆపరేటర్లు  అవసరమని అంచనా వేసిన ఆఫీసర్లు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.

ప్రాథమికంగా మున్సిపల్, ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాల్లో ఆన్​లైన్​ లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించినా, అవసరాన్ని బట్టి  తహసీల్దార్​ ఆఫీస్, డిగ్రీ కాలేజీలను ఉపయోగించనున్నారు. ఈ నెలంతా సర్వే వివరాలను ఆన్​లైన్  చేయనున్నారు. ఒక అప్లికేషన్​కు 20 నిమిషాలుజిల్లాలో 4,69,988 ఇండ్లకు ఇంటింటి సమగ్ర సర్వే స్టిక్కరింగ్​ వేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్​ మున్సిపాలిటీలలో 1,076 మంది ఎన్యుమరేటర్లు, 102 మంది సూపర్​వైజర్లు, గ్రామాల్లో 2,267 మంది ఎన్యుమరేటర్లు, 268 మంది సూపర్​వైజర్లను సర్వే విధులలో నియమించారు. 

ఈనెల 5 నుంచి మూడు రోజులు స్టిక్కరింగ్​ వేసి 8 నుంచి సర్వే ప్రారంభించారు. 75 ప్రశ్నలతో కూడిన సర్వే ఫాం నింపడానికి మొదట్లో 40 నిమిషాలు పట్టింది. తర్వాత20 నిమిషాలకు తగ్గింది. ఇప్పటి వరకు 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. షెడ్యూల్​ ప్రకారం 18 తేదీకి సర్వే ముగియాల్సి ఉండగా ఇంకా కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో పూర్తి చేయాలనే ఆదేశించంతో ఎన్యుమరేటర్లు సర్వే ముమ్మురం చేశారు.  ఒకపైపు సర్వే కొనసాగిస్తూనే ఆన్​లైన్​ఎంట్రీకి నిర్ణయించారు.  నిజామాబాద్​నగరపాలక, బోధన్​, ఆర్మూర్​, భీంగల్​ టౌన్​లో గురువారం ఆపరేటర్లకు ట్రైనింగ్​ ఇచ్చారు.  మధ్యాహ్నం డెమో నిర్వహించిన ఆఫీసర్లు సాయంత్రం నుంచి ప్రారంభించారు.  ఒక అప్లికేషన్​ వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేయడానికి 20 నిమిషాలు పడుతోంది.

ఫారంలోని ప్రతీ అంశాన్నీ..

జిల్లాలో నాలుగు పట్టణాలు, 530  గ్రామాలు, 33 మండలాలు ఉన్నాయి.  డేటా ఎంట్రీకి మొత్తం 1,500 కంప్యూటర్లను సిద్ధం చేశారు.  జనవరిలో నిర్వహించిన  ప్రజాపాలన దరఖాస్తులను ఆన్​లైన్​ చేయడానికి ఉపయోగించిన ఆపరేటర్లందరినీ మళ్లీ పిలిచారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆన్​లైన్​ కోసం చెల్లించిన రెన్యూమరేషన్​ కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తామని ప్రైవేట్​ ఆపరేటర్లకు తెలిపారు.

ప్రజాపాలన దరఖాస్తుల ఆన్​లైన్​లో దొర్లిన పొరపాట్లను రిపీట్​ కాకుండా  జాగ్రత్తగా  చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా కులం, ఉప కులం తదితర వాటికి కోడ్​ నంబర్లు కేటాయించినందున వాటిని తప్పుగా ఆన్​లైన్​లో ఎంటర్​ చేస్తే అసలుకే మోసం వస్తుంది.  ఫారంలోని ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా ఎంట్రీ చేయించనున్నారు.