విద్యా వ్యవస్థపై సమ్మె ఎఫెక్ట్​

 విద్యా వ్యవస్థపై  సమ్మె ఎఫెక్ట్​
  • 11 రోజులుగా సమ్మెలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 
  • కేజీబీవీ, యూఆర్ఎస్ లో కుంటుపడుతున్న విద్యాబోధన 
  • పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో స్టూడెంట్స్​, పేరెంట్స్​ ఆందోళన  
  • ఎమ్మార్సీలు, డీఈఓ ఆఫీస్​లలో స్థంభించిన పనులు

మెదక్, చిన్నశంకరంపేట, వెలుగు: తమ డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష అభియాన్​ (ఎస్​ ఎస్​ ఏ) ఉద్యోగులు గత 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుండటం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో ఎంఈఓ ఆఫీస్​లలో పనిచేసే 48 మంది, కాంప్లెక్స్​ స్థాయిలో పనిచేసే 66 మంది, స్కూళ్లలో  పనిచేసే  78 మంది, కేజీబీవీలు, అర్బన్​ రెసిడెన్షియల్​ స్కూళ్లలో  పనిచేసే 364 మంది, భవిత సెంటర్​ లలో పనిచేసే 29 మంది, డీఈఓ ఆఫీస్​లో పనిచేసే 7 గురు కలిపి మొత్తం 585 మంది ఎస్​ ఎస్​ ఏ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.  

పలు స్కూళ్లలో  విద్యా బోధనకు ఆటంకం ఏర్పడి సిలబస్​ జరగక విద్యార్థులు నష్టపోతున్నారు.  మండల వనరుల కేంద్రాలు (ఎమ్మార్సీ), జిల్లా విద్యాశాఖ కార్యాలయం (డీఈఓ)లలో పనులు ఆగిపోయాయి.  విద్యాభివృద్ధి, స్కూళ్లలో  వసతుల మెరుగుదలకు, టీచర్స్​  మెడికల్​ బిల్స్​, ఇంక్రిమెంట్స్​కు సబంధించి ఫైల్స్​ పెండింగ్​ లో పడిపోతున్నాయి.  

జిల్లాలోని 20 కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో పనిచేసే కాంట్రాక్ట్​ రెసిడెన్షియల్​ టీచర్స్​ (సీఆర్​టీ)  సమ్మె చేస్తుండటంతో సిలబస్​ ఆగిపోయింది.  దీంతో పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో స్టూడెంట్స్​, పేరెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. స్పెషల్​ ఆఫీసర్​లు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో కేజీబీవీల నిర్వహణ దెబ్బతిన్నది. కంప్యూటర్​ ఆపరేటర్​లు విధులకు హాజరుకాకపోవడంతో విద్యార్థులకు సంబంధించిన వివరాల ఆన్​లైన్​, ఉన్నతాధికారులకు రిపోర్టులు పంపడం నిలిచిపోయింది. హైస్కూళ్లలో  పనిచేసే పార్ట్​ టైం ఇన్స్ట్రక్టర్​ లు సమ్మె చేస్తుండటంతో కంప్యూటర్​, ఆర్ట్​ , ఫిజికల్​ ఎడ్యుకేషన్​ నిలిచిపోయింది.  క్లస్టర్​ రీసోర్స్​ పర్సన్​ (సీఆర్పీ)లు సమ్మెలో పాల్గొంటుండటంతో స్కూల్​ల పర్యవేక్షణ కొరవడింది.  ఐఆర్సీల సమ్మెతో భవిత సెంటర్​ లు పనిచేయక దివ్యాంగ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆఫీస్​లలో పనులు జరగక...

ఎమ్మార్సీలలో పనిచేసే ఎంఐఎస్​ కోఆర్డినేటర్​లు, కంప్యూటర్​ ఆపరేటర్​లు విధులు బహిష్కరించడంతో టీచర్​లకు సంబంధించిన మెడికల్ బిల్లులు, లీవ్ లకు సంబంధించిన పలు ప్రొసీడింగ్ లు, ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్ లు ఆగిపోయాయి. స్కూల్​ లకు చేరాల్సిన మధ్యాహ్న భోజన బియ్యం ఆలస్యం అవుతోంది. స్టూడెంట్స్​ యూనిఫాంల డిక్లరేషన్లు సమయానికి అందకపోవడం వల్ల కుట్టడం ఆలస్యం అవుతోంది. స్కూల్​లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర వసతుల వివరాలు ఆన్లైన్ నమోదు, స్టూడెంట్స్​ బయోమెట్రిక్ హాజరు, మార్కులు ఆన్లైన్ చేయడం, అమ్మ ఆదర్శ పాఠశాలకు, మన ఊరు మన బడి స్కీంలకు  సంబంధించిన రిపోర్టులు, ఎస్​ ఎస్​ సీ పరీక్షల నామినల్ రోల్స్ ఉన్నతాధికారులకు పంపడం ఆలస్యం అవుతోంది.  అలాగే బడి బయట పిల్లలకు సంబంధించిన సర్వే నిలిచిపోయింది. 

డీఈఓ ఆఫీస్​లో పనిచేసే ఎస్​ ఎస్​ ఏ ఉద్యోగులు సైతం సమ్మెలో ఉండటంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వులు, ఆదేశాలు మండలాలకు పంపడం, జిల్లా నుంచి ఉన్నతాధికారులకు రిపోర్ట్​లు పంపడానికి ఆవరోధం ఏర్పడింది.