డిప్యూటీ సీఎంతోచర్చలు సఫలం..విధుల్లో చేరుతాం..సమగ్ర శిక్ష ఉద్యోగులు

డిప్యూటీ సీఎంతోచర్చలు సఫలం..విధుల్లో చేరుతాం..సమగ్ర శిక్ష ఉద్యోగులు
  • డిప్యూటీ సీఎం భట్టితో చర్చలు సఫలం 
  • పే స్కేల్ అమలుపై కేబినెట్ సబ్​కమిటీలో నిర్ణయం 
  • సమ్మె కాలానికి వేతనానికి భట్టి హామీ 

హైదరాబాద్, వెలుగు:సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడంతో సమ్మెను వాయిదా వేశారు. మంగళవారం నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించారు. 

సోమవారం హైదరాబాద్​లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరామ్ ఆధ్వర్వంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో ఉద్యోగుల సంఘం నేతలు చర్చలు జరిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని కోరారు. 

ALSO READ : హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులే ఫిర్యాదులు.. స్వయంగా కంప్లయింట్స్ ​తీసుకున్న హైడ్రా చీఫ్​

సర్కారు ఉద్యోగాల్లో సమగ్రశిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, మరణించిన ఉద్యోగులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు గతంలో మాదిరిగా అదనపు పనికి గానూ ఇన్సెంటీవ్స్ ఇవ్వాలని, పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె కాలానికి పూర్తి వేతనం ఇవాలన్నారు. దీనిపై పే స్కేల్, ఇతర ఆర్థిక పరమైన అంశాలను కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క ఉద్యోగులకు హామీఇచ్చారు. 

మిగిలిన అంశాలను విద్యాశాఖ సెక్రటరీ, సమగ్ర శిక్ష ఎస్​పీడీతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. సమ్మె కాలానికి వేతనం ఇవ్వనున్నట్టు వారికి హామీనిచ్చారు. దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, ట్రెజరర్ దుర్గం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ అనిల్ చారి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ స్టేట్ ప్రెసిడెంట్ ఎం.సురేందర్ తదితరులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి సమ్మెను విరమిస్తున్నట్టు లేఖను అందించారు.