సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

ఢిల్లీ పర్యటనలో  బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ సమాజ్ వాదీ పార్టీ అధినేత  అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. తుగ్లక్  రోడ్డు 23 లోని కేసీఆర్  నివాసంలో సమావేశమయ్యారు.  అఖిలేష్ యాదవ్ ను విందుకు ఆహ్వానించారు సీఎం కేసీఆర్. వీళ్లిద్దరు దేశంలోని తాజా రాజకీయాల గురించి చర్చించనున్నారు. 
ఢిల్లీలో మీడియా రంగానికి చెందిన ప్రముఖులతోనూ ఆయన సమావేశం అవనున్నారు. వారితో దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

 

ఢిల్లీ పర్యటన తర్వాత 22న చండీగఢ్, 26న బెంగళూర్, 27న రాలేగావ్ సిద్ధి, 29 లేదా 30న బెంగాల్, బీహార్ లోనూ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆర్మీ అమరవీరుల కుటుంబాలను, అగ్రిచట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలను కూడా సీఎం పరామర్శించనున్నారు. ఉద్యమంలో చనిపోయిన 600 మంది రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు. బెంగళూర్ టూర్ లో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్ భేటీ అవుతారు. 27వ తేదీన రాలేగావ్ సిద్ధి చేరుకుని, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సమావేశమవుతారు. అక్కడి నుంచి షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని, హైదరాబాద్ కు తిరిగి వస్తారు. ఆ తర్వాత 29 లేదా 30న బెంగాల్, బీహార్ పర్యటనకు సీఎం వెళ్లనున్నారు.