ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం

ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం

2024 జనరల్ ఎన్నికల సందర్భంలో సమాజ్​వాది పార్టీ  ప్రజా ఆకాంక్షల పత్రం జారీ చేసింది. అంబేద్కర్- సిద్ధాంతాల ఆధారంగా తమ విజన్ ను​ దేశం ముందు ఉంచింది. - రాజ్యాంగాన్ని కాపాడే అధికారం ప్రధానంగా మత రాజకీయాలకు గుండెలాంటి ఉత్తరప్రదేశ్​లో  సమాజ్​వాది పార్టీ  బీజేపీతో ముఖాముఖి తలపడుతోంది రాజ్యాంగాన్ని కాపాడుకునే  ప్రజా అధికారం కోసం సమాజ్​వాది పార్టీ  పోరాటం చేస్తోంది. రాజ్యాంగం గుర్తించిన బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనారిటీల రక్షణ కోసం పీడీఏ రూపంలో ఎన్డీఏను ఓడించడానికి ప్రజా ఉద్యమాన్ని పార్టీ చేపట్టింది. 

మీడియా స్వేచ్ఛకు,  ప్రజాస్వామ్య పరిరక్షణకు, న్యాయం,  సమానత్వం,  ప్రజాస్వామిక సంస్థలను  కాపాడే ఆలోచనలను విజన్ పత్రంలో చేర్చింది.  'ప్రజా ఆకాంక్షలు- మా అధికారం' అనే పత్రంలో పలు ఇతర అంశాలను పొందుపరిచింది.

సామాజిక, ఆర్థిక అధికారం

ఆహారం, అధికారంతోపాటు సామాజిక, ఆర్థిక అధికారంలో భాగంగా పేదరికం నుంచి బయటపడే మార్గాల రూపకల్పనకు పార్టీ కట్టుబడి ఉంది.  నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రరూపం దాల్చడంతో ధరల పెరుగుదలను  కట్టడి చేసే ప్రజా అధికారం సాధనకు పార్టీ కృషి చేస్తోంది. 

కులగణన

గత 75 ఏండ్లుగా దేశంలో పలు సామాజిక వర్గాలు, పార్టీలు కులగణనను జరపాలని ఉద్యమిస్తున్నాయి. బీజేపీ, ఆ పార్టీ అనుబంధ సంఘాలు కులగణనను అడ్డుకుంటున్నాయి.   కులగణన ద్వారానే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరుగుతుంది. అందుకని 2025 నాటికి కులగణన, 2029 నాటికి భాగస్వామ్యం ద్వారా అందరికీ న్యాయం కల్పించనున్నట్లు ఆకాంక్షల పత్రం తెలియజేస్తోంది.  మోదీ ప్రభుత్వ పాలనలో  ప్రైవేటీకరణతోపాటు పలు పబ్లిక్ సెక్టార్ యూనిట్లను కార్పొరేట్లకు అమ్మడంతో లక్షల్లో ఉద్యోగ రిజర్వేషన్లను పీడీఏ సమాజాలు కోల్పోతున్నాయి.  రిజర్వేషన్లను అడ్డుకోవడం  ప్రజాస్వామిక రాజ్యాంగ స్ఫూర్తికి  విరుద్ధం.  ప్రభుత్వ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఖాళీల భర్తీకు 2025లోపే నియామకాలను పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో అన్ని సామాజిక వర్గాలకు భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు హక్కుల పత్రం తెలియజేస్తుంది.

రైతు సంక్షేమం

 వ్యవసాయంలో గిట్టుబాటు ధరలు లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  రైతాంగం పలు సమస్యలతో ఇబ్బంది పడుతూ వెనుకబాటుతనానికి గురవుతున్నది. కాబట్టి,  రైతు సంక్షేమం పాలనతో సహా అన్ని పంటల కనీస మద్దతు ధర కల్పిస్తుందని సమాజ్​వాది హక్కుల పత్రం తెలియజేస్తోంది. భూమిలేని రైతుల రుణాలతోపాటు, వ్యవసాయ రైతు రుణాలన్నీ మాఫీ చేయడం, రైతులకు నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.

యువతకు -ఉపాధి

ఉపాధి హామీపై  ఎన్ఆర్ఈజీఏ  కింద వేతనాలను రూ. 450 కు పెంచుతూ సంవత్సరానికి 150 పనిదినాలను కల్పించడానికి ఆకాంక్షల పత్రంలో సంకల్పించాం.  ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడం, యువత కోసం దేశవ్యాప్తంగా లాప్​టాప్​ పంపిణీ పథకాన్ని చేపట్టడం, పోటీ పరీక్షల్లో అవినీతిని పూర్తిగా తొలగించడం జరుగుతుంది. 

మహిళా సాధికారిత 

మహిళా సాధికారిత కోసం నియోజకవర్గాల డీ లిమిటేషన్ వరకు ఎదురు చూడకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎస్పీ కల్పించనుంది. అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన పీడీఏ మహిళలకు వారి జనాభా దామాషా ప్రకారం భాగస్వామ్యం కల్పించనుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు నెలకు 3000 పెన్షన్,  అదేవిధంగా బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యాహక్కును కల్పించడం జరుగుతుంది. మహిళలకు దేశవ్యాప్త హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనున్నాం.

కార్మిక సంక్షేమం, పరిశ్రమలు

2014లో  ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ యూనిట్లపై ప్రైవేటీకరణను అతివేగంగా ముందుకు తీసుకుపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్ల  ప్రైవేటీకరణ నిలిపివేయడానికి సమాజ్​వాది పార్టీ కట్టుబడి ఉంది. ఉదారవాద ఆర్థిక వ్యవస్థలో  కనీస దినసరి వేతనం అందని క్రమంలో కనీస వేతనాన్ని పెంచడం జరుగుతుంది. పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను పునరుద్ధరించటానికి కట్టుబడి ఉన్నామని విజన్ పత్రం తెలియజేస్తుంది.  ప్రపంచ వాణిజ్యంలో ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ముందుకుపోతుంది.

‘అగ్నివీర్’​ రద్దు

ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం సైనికుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తోంది. నాలుగు సంవత్సరాలకి రిటైర్ చేసే పాలసీ, అగ్నివీర్ విధానాన్ని రద్దు చేస్తుందనీ విజన్ పత్రం తెలియజేస్తోంది. సాయుధ దళాలలో రెగ్యులర్ నియామకాలను పునరుద్ధరించడం, రక్షణ రంగంలో స్వదేశీకరణకు ఎస్పీ కట్టుబడి ఉంది.  జాతీయ భద్రత,  సార్వభౌమాధికారం ప్రతి సందర్భంలోనూ రక్షించబడుతుంది. 

గ్రామీణ అభివృద్ధి

గ్రామీణ అభివృద్ధి లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా 'స్మార్ట్ విలేజ్ క్లస్టర్లను' ఏర్పాటు చేస్తూ ప్రజావసరాలకు అనుకూలంగా  సర్వీస్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.  గ్రామస్థాయిలో ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజా సౌకర్య కేంద్రాలను ప్రోత్సహించడం జరుగుతుంది. తలసరి ఆదాయం మెరుగుపడేలా సార్వత్రిక అభివృద్ధి లక్ష్యంగా విధానాలను రూపొందించడం జరుగుతుంది.   ప్రజా అధికారం కోసం సమాజ్ వాది  ఉద్యమిస్తోంది.

విద్య, వైద్యం

పేదరికం, సామాజిక వెనుకబాటుతనంపై పోరాటం చేసే కీలకమైన అంశం విద్య.  అలాంటి విద్యను  బీజేపీ  ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.  దురదృష్టవశాత్తు మూడు శాతం కంటే తక్కువగానే బడ్జెట్ కేటాయించడం గత పది సంవత్సరాలుగా జరుగుతోంది.  సమాజ్​వాది పార్టీ ఉచిత నాణ్యమైన విద్యను అందించడానికి విద్యా బడ్జెట్లో మూడు శాతం నుంచి ఆరు శాతానికి పెంచనున్నట్లు తెలియజేస్తున్నది. అదేవిధంగా కనీస వడ్డీలతో విద్యా రుణాలను అందిస్తామని స్పష్టం చేస్తోంది.

- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన, 
రాష్ట్ర అధ్యక్షుడు, 
సమాజ్​వాది పార్టీ, తెలంగాణ.