సంభాల్ అల్లర్ల కేసు..ఎంపీ సహా 400 మందిపై కేసులు

సంభాల్ అల్లర్ల కేసు..ఎంపీ సహా 400 మందిపై కేసులు
  • ఎస్పీ ఎమ్మెల్యే కొడుకుపైనా ఎఫ్ఐఆర్
  • 25 మంది నిందితులు అరెస్ట్ 
  • రాళ్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్  పరిస్థితి విషమం

సంభాల్:  ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ లో షామీ జామా మసీదు వద్ద సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్  రెహమాన్  బార్క్, ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్  మెహమూద్  కొడుకు సోహైల్  ఇక్బాల్  కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి ఆదివారం ఉదయం వెళ్లిన బృందంపై స్థానిక ముస్లింలు రాళ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే.

ఈ దాడిలో పలువురు అధికారులు, 20 మంది పోలీసులు గాయపడ్డారు. ఒక కానిస్టేబుల్  తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడంతో పలువురు గాయపడ్డారు. వారిలో ఆదివారం ముగ్గురు చనిపోగా.. సోమవారం మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఎస్పీ ఎంపీ జియా ఉర్  రెహమాన్  బార్క్  ఇచ్చిన పిలుపుతోనే హింస నెలకొందని ఎస్పీ కృష్ణ కుమార్  తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సీసీటీవీ కెమెరాల సాయంతో ఆందోళనకారులను గుర్తిస్తున్నాం.

బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను తగలబెట్టడంతో పాటు పోలీసులపైనా కాల్పులు జరిపారు” అని ఎస్పీ వెల్లడించారు. హింస జరిగినపుడు ఎస్పీ ఎంపీ బార్క్.. బెంగళూరులో ఉన్నారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అంతకుముందు ఎంపీ ఇచ్చిన పిలుపుతోనే హింస జరిగిందని, ఆయన చేసిన వ్యాఖ్యలపైనే ఎంపీపై కేసు నమోదు చేశామని ఎస్పీ కృష్ణ కుమార్  చెప్పారు. కాగా.. హింస నేపథ్యంలో సోమవారం విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. ఇంటర్ నెట్  సర్వీసులను 24 గంటల పాటు నిలిపివేసింది. ఈనెల 30 వరకు బయటివారు సంభాల్ లో ప్రవేశించకుండా నిషేధిత ఉత్తర్వులు జారీచేసింది.