Sambhal Violence: సంబాల్ హింసాత్మక ఘటన ఎఫ్ఐఆర్..అతనే గుంపును రెచ్చగొట్టాడు

Sambhal Violence: సంబాల్ హింసాత్మక ఘటన ఎఫ్ఐఆర్..అతనే గుంపును రెచ్చగొట్టాడు

యూపీలోని సంబాల్ హింసాత్మక ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈఘటన వెనక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్, అతని కొడుకు సోహిల్ ఇక్బాల్ తోపాటు 800 మంది ఉన్నట్లు పోలీసులు ఎఫ్ ఐఆర్ లో తెలిపారు. మసీదు సర్వే సమయంలో రెహ్మాన్, అతని కొడుకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని హింసకు పురిగొల్పారని పేర్కొన్నారు. 

హింస జరగడానికి రెండు రోజుల ముందు రెహ్మాన్ నమాజ్ కోసం మసీదుకు వెళ్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడని ఎఫ్ఐఆర్ పేర్కొంది. సంఘటన జరిగిన రోజు .. సోహైల్ ఇక్బాల్, మరికొంతమంది గుంపును రెచ్చగొట్టారని ఎఫ్ ఐఆర్ పేర్కొన్నారు. 

ALSO READ | Google Map: గూగుల్ మ్యాప్స్పై కేసు

మసీదు సర్వేకు అడ్డురావొద్దని అధికారులు, పోలీసులు గుంపు ను కోరినా వినలేదని.. నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారని, పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారని ఎఫ్ ఐఆర్ లో తెలిపారు. గుంపు దాడుల్లో అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు, గుర్తు తెలియని షూటర్ హత్య చేయాలనే ఉద్దేశ్యంతో సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరిపై కాల్పులు జరిపాడు. అధికారి కుడి కాలికి బుల్లెట్ గాయమైందని పేర్కొన్నారు. 

ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందిని గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నేరస్తులను గుర్తించేందుకు డ్రోన్ ఫుటేజీలు, సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, కఠినమైన నేషనల్ సెక్యూరిటీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఎందుకీ అల్లర్లు.. 

సంబాల్ ప్రాంతంలో ఉన్న షాహి జామా మసీదు మొఘల్-యుగం నాటిది..ఇది హిందూ దేవాలయం ఉన్న స్థలంలో నిర్మించబడిందని కొందరు కోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో ఈ మసీదు న్యాయ పోరాటం, అల్లర్లకు కేంద్రంగా నిలిచింది. కోర్టు మసీదు సర్వేకు ఆదేశించింది. ఆదివారం (నవంబర్ 24) మసీదును సర్వే చేస్తుండగా ఓ వర్గం వారు అడ్డుకోవడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో నలుగురు చనిపోయారు.