సామల వేణుకు గోల్డెన్ మెజీషియన్ అవార్డు

సామల వేణుకు గోల్డెన్ మెజీషియన్ అవార్డు

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రానికి చెందిన ప్రముఖ మెజీషియన్ సామల వేణుకు లైఫ్ టైమ్ అచీవ్​మెంట్ అవార్డు (గోల్డెన్‌‌ మెజీషియన్‌‌) వరించింది. బీఎస్ రెడ్డి స్థాపించిన ఇండియన్ మ్యాజిక్ అకాడమీ (ఐఎంఏ) పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ మెజీషియన్ డే సందర్భంగా ప్రముఖ మెజీషియన్లు పీసీ సర్కార్ జూనియర్, సామల వేణుకు ఈ అవార్డులను ప్రకటించారు. వైజాగ్‎లోని కళాభారతి ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 

సామల వేణు, పీసీ సర్కార్ జూనియర్‎కు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, సెంచూరియన్‌‌ యూనివర్శిటీ చాన్స్​లర్ ఆచార్య జీఎస్‌‌ఎన్‌‌ రాజు అవార్డులను అందజేశారు. దేశ, విదేశాల్లో వేలాది మెజీషియన్ షోలు నిర్వహించిన సామల వేణు సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించినట్లు బీఎస్ రెడ్డి పేర్కొన్నారు. సామల వేణును ఎంపీ శ్రీభరత్ ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఇంకా కొన్నిచోట్ల ఉన్న మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు మెజీషియన్లు కృషి చేయాలని, సీనియర్​ మెజీషియన్లు తమ ఆధ్వర్యంలో కొత్త వారిని తయారు చేయాలని ఎంపీ కోరారు.

 ప్రభుత్వం తరఫున మెజీషియన్లకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. 45 ఏండ్ల తన అనుభవంలో 35 దేశాల్లో 7వేలకు పైగా మెజీషియన్ షోలు ఇచ్చినట్లు సామల వేణు తెలిపారు. సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో విద్యాబోధనకు అనుగుణంగా తెలుగు యూనివర్శిటీలో డిప్లొమా ఇన్‌‌ మ్యాజిక్‌‌ కోర్సును అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఏటా కనీసం 25 మంది ఆ కోర్సు నేర్చుకుని, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయగలినట్టు వివరించారు.