వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న సమంత, మరోవైపు ఓ ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీలో నటిస్తోంది. విజయ్ దేవరకొండకు జంటగా ఆమె నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు. గతేడాదే రావాల్సిన ఈ సినిమా సమంత అనారోగ్య సమస్యల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు.
శుక్రవారం సమంత పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. సింపుల్ కాస్ట్యూమ్స్ తో మెడలో ఆఫీస్ ట్యాగ్ వేసుకుని సమంత నవ్వుతూ వస్తున్న ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ప్రేమ కథా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సెలెబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా సమంతకు బర్త్ డే విషెస్ చెప్పారు.