
ఓటీటీల్లో యాక్షన్ వెబ్‌సిరీస్‌లకు ఉండే క్రేజ్ తెలిసిందే. అందుకే కాస్త క్లిక్ అయ్యిందంటే చాలు వరుస సీక్వెల్స్ చేస్తుంటారు. హిందీలో వచ్చిన ఫ్యామిలీమ్యాన్, పాతాళ్ లోక్, మిర్జాపూర్, ఆశ్రమ్ లాంటి వెబ్ సిరీస్‌లకు వరుస సీక్వెల్స్ వచ్చాయి. ఇదే బాటలో సమంత నటించిన ఓ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడది రద్దు అయింది. వివరాల్లోకి వెళితే..
సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’.రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇది ఇండియన్ వెర్షన్. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఇండియన్ వెర్షన్‌తో పాటు ఇటాలియన్ వెర్షన్ అయిన ‘సిటాడెల్: డయానా’సీక్వెల్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ రెండింటి కొనసాగింపు కథలను ఒరిజినల్ వెర్షన్‌లో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. మాతృకను మరింత గొప్పగా తెరకెక్కించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పార్ట్ 2ను సినిమాగా తీసుకొచ్చే విషయంలో చర్చలు జరుగుతున్నట్టు ఆమధ్య హీరో వరుణ్ ధావన్ చెప్పాడు.
కానీ అమెజాన్ ప్రైమ్ సంస్థ అందరికీ షాక్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేసింది. ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడం వల్లే సీక్వెల్‌ను నిలిపివేసినట్టు సమాచారం. రిజల్ట్ మాటెలా ఉన్నా ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడింది. యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది.